కోత కష్టం !

ABN , First Publish Date - 2020-12-02T04:45:49+05:30 IST

రోజురోజుకూ మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతులు చేతికందిన వరిపంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

కోత కష్టం !
వరికోతలు కోస్తున్న హర్వస్టర్

వరికోతకు తీవ్రంగా కూలీల కొరత

హార్వెస్టర్లకు భారీగా పెరిగిన డిమాండ్‌

ఇదే అదనుగా దోచుకుంటున్న యంత్రాల యజమానులు

  ఇల్లెందు, డిసెంబరు 1: రోజురోజుకూ మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతులు చేతికందిన వరిపంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత వల్ల వరికోతలు, నూర్పిళ్ల(కుప్పలుకోట్టడం)కు కూలీలు లభ్యం కాకపోవడంతో రైతులు వరికొత యంత్రాల (హార్వెస్టర్‌)కోసం పరుగులు పెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వరికొత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో నల్లగొండ, మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి వరికోత యంత్రాలను రప్పించి వరికొతలు సాగిస్తున్నారు. యంత్రాల ద్వారా వరికోతలు చేయడం వల్ల ఏకకాలంలో పంట కోయడంతో పాటు ధాన్యం కూడా ఒకే సమయంలో ఇంటికి చేర్చుకునే సౌలబ్యం ఉండటంతో రైతులు యంత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు లభ్యం కావడంలేదని పలువురు రైతులు వాపోతున్నారు. అంతేగాక కొన్ని గ్రామాల్లో కూలీలు లభ్యమైనప్పటీకీ భారీ మొత్తాల్లో కూలీ రేట్లు డిమాండ్‌ చేయడం. కుప్పల నూర్పులకు అధికరేట్లు డిమాండ్‌ చేయడం పెనుభారంగా ఉందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూలీ రేట్లకే పంట దిగుబడులు సరిపోయే పరిస్థితులు  ఉన్నాయని కుంగిపోతున్నారు. అంతేగాక కూలీలతో వరికోతలు జరిపించడం, నూర్పుల పనులు చేయించడం వల్ల ధాన్యం ఇళ్లకు చేరడానికి కనీసం వారం పదిరోజులు పడుతుండడంతో  ఈ మధ్య కాలంలో తుఫాన్‌లు వస్తే ఏంటనే భయంతో పేద మధ్యతరగతి రైతులంతా వరికోత యంత్రాల కోసం పరుగులు పెడుతున్నారు. 

దండుకుంటున్న యంత్రాల యజమానులు

గ్రామాల్లో రైతులను కూలీల కొరత, తుఫాన్‌ భయం వెంటాడుతుండడంతో కొందరు ఇతర జిల్లాలనుంచి వరికోత యంత్రాలను తెప్పించి పెద్దమొత్తాల్లో దండుకుంటున్నారు. యంత్రాలను  లీజు పద్దతిలో తీసుకొస్తుండగా మరికొందరు తమ పరిచయస్తులను యంత్రాలతో రప్పించి రైతులనుంచి ఆర్డర్లు బుక్‌చేయడం ద్వారా యంత్రాలతో వరికోతలు జరిపిస్తున్నారు. యంత్రాలకు గంటల ప్రకారం కిరాయి వసూలు చేస్తూ రైతుల నుంచి భారీ మొత్తాల్లో దండుకుంటున్నారు. ఒక గంట వరికోతకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాక వరికోతల సమయంలో హార్వెస్టుర్లు పొలాల్లో దిగబడితే వాటిని బయటకు తీసేందుకు ఎక్స్‌కవేటర్లను వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా వాటి యజమానుల సైతం రూ.4వేల వరకు తీసుకుంటున్నారు. ఈ సొమ్మును కొన్నిసార్లు రైతులే చెల్లించాల్సి వస్తోంది. యంత్రాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా దండుకుంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-02T04:45:49+05:30 IST