పోలీసుల నుంచి తప్పించుకునే సమయంలోనే ఇలా జరిగిందా? లేదా ప్రమాదవశాత్తా?

ABN , First Publish Date - 2020-10-28T16:34:08+05:30 IST

తిరుపతిలో పోలీసులు ఓ పేకాట శిబిరంపై దాడి నిర్వహించిన సమయంలో..

పోలీసుల నుంచి తప్పించుకునే సమయంలోనే ఇలా జరిగిందా? లేదా ప్రమాదవశాత్తా?

ఇంతకీ ఏం జరిగింది? 

తిరుపతి కొత్తవీధిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి 

పక్కన భవనంపైనుంచి పడి కార్పొరేషన్‌ ఉద్యోగి మృతి 

ప్రమాదమా.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమమా? 


తిరుపతి: తిరుపతిలో పోలీసులు ఓ పేకాట శిబిరంపై దాడి నిర్వహించిన సమయంలో.. దాని పక్కనున్న మరో భవనంపై నుంచి ఓ కార్పొరేషన్‌ ఉద్యోగి కిందపడి మృతిచెందారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదా పేకాట ఆడుతూ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడ్డారా? ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నగరంలోని కొత్తవీధిలో వున్న ఓ ఇంట్లో పేకాట శిబిరాన్ని నిర్వ హిస్తున్నట్టు స్పెషల్‌ బ్రాంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వీరు మంగళవారం సాయం త్రం వెస్ట్‌ పోలీసులతో కలిసి పేకాట శిబిరంపై దాడిచేశారు. 11మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.41,500 స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప తెలిపారు.


కాగా, వీరు దాడులు నిర్వహించిన సమయంలో ఈ భవనానికి పక్కనున్న మరో భవనంపై నుంచి తిరుపతి మున్సిపల్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ రాగిపాటి కృష్ణయ్య (47) కిందపడ్డారు. దీనిని గమనించిన పోలీసులు ఆయన్ను హుటాహు టిన రుయాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన ప్రమాదవశాత్తు పడ్డారా? లేదా పేకాట ఆడుతూ.. పోలీసులనుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పైనుంచి కిందపడ్డారా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. పేకాట శిబిరంలో రాగిపాటి కృష్ణయ్య లేరని చెప్పారు. అయితే ఆయన అక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా కిందపడ్డారనే విషయాలను పూర్తి స్థాయిలో దర్యాప్తుచేసి తరు వాత వెల్లడిస్తామన్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు చెప్పారు.

 

కుట్రచేసి చంపేశారు

ఇదిలా ఉండగా.. రాగిపాటి కృష్ణయ్యను కొంత మంది కుట్రచేసి చంపేశారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుపతి మున్సిపాలిటీలో కొందరు ఆయన్ను బాగా ఇబ్బందుల పాల్జేశారని, ఈ కారణంగా ఇటీవల వరకు సస్పెండై ఉన్నారని చెప్పారు.ఇటీవల తిరిగి ఉద్యోగంలో చేరిన ఆయన్ను వాళ్లే కుట్రతో చంపేశారని ఆరోపిస్తున్నారు. భవనం పైనుంచి కిందపడిన ఆయనకు ముక్కువద్ద చిన్న గాయంతప్ప మరో గాయం లేకపోవడం ఏంటని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-28T16:34:08+05:30 IST