ఆదివాసీ మహిళలకు లైంగిక వేధింపులు

Published: Sat, 25 Jun 2022 00:24:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon

  పోడు భూముల విషయంలో అటవీశాఖాధికారుల అరాచకం

 ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల కృష్ణ

 కొత్తగూడలో ఫారెస్టు కార్యాలయం ముట్టడి

కొత్తగూడ, జూన్‌ 24 : పోడు భూముల విషయంలో ఆదివాసీ మహిళలను అటవీశాఖాధికారులు లైంగిక వైధింపులకు గురిచేస్తున్నారని  ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఏఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల కృష్ణ ధ్వజమెత్తారు. ‘సాగుభూములు కావాలంటే తమతో గడపాలి’ అని అటవీశాఖ అధికారులు ఆదివాసీ మహిళలను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ‘మా భూములు మాకే కావాలి, ‘ఆదివాసీ సాగుభూములకు పట్టాలు ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం అటవీశాఖ కార్యాలయం ముట్టడిని చేపట్టారు. ముందుగా కొమురంభీం విగ్రహానికి పూల మాలలు వేసి ర్యాలీగా తరలివచ్చారు. అటవీశాఖ రేంజ్‌ కార్యాయం ముందు బైఠాయించారు. ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మల్లెల కృష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీ గ్రామాల్లో అటవీశాఖ అధికారులు నిజాం ప్రభుత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.   కొత్తగూడ మండంలోని కార్లాయి గ్రామంలో పంట భూముల్లో పని చేసుకుంటున్న ఆదివాసీ మహిళలను అటవీశాఖ అధికారులు అడ్డుకుని అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. ఎర్రవరం గ్రామంలో ఆదివాసీ రైతు అడవి నుంచి ఎండు పుల్లలు తీసుకువస్తుంటే.. కొత్తగూడ అటవీ శాఖ రేంజ్‌ అధికారి ఎడ్లబండికి నిప్పంటించి కాల్చివేశారని ఆరోపించారు.  పుట్టలభూపతి గ్రామంలో ఆదివాసీ రైతు వ్యవసాయపనులు చేసుకుంటుంటే గంగారం రేంజ్‌లో బంధించారని అన్నారు. దాహంతో నీళ్లు కావాలని అడిగిన సదరు రైతుకు మూత్రం తాగిస్తామని అవహేళనగా మాట్లాడారని ఆరోపించారు. ఆదివాసీల కోసం రాజ్యాంగంలో పెసా చట్టం, అటవీహక్కుల చట్టం, 1/70 చట్టాలను పొందుపర్చారని గుర్తుచేశారు. హక్కులు, చట్టాలు అమలు పరచాల్సిన బాధ్యత అధికారులకు ఉందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దనసరి రాజేశ్వరరావు, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్‌ నూపా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూనెం జనార్దన్‌, జిల్లా కార్యదర్శి దారం నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.