కోఠి ఈఎన్‌టీ వైద్యుడికి అంతర్జాతీయ అవార్డ్‌

ABN , First Publish Date - 2021-06-19T18:54:51+05:30 IST

తలనొప్పికి రకరకాల కారణాలు ఉంటాయి. ముక్కు వెనుక భాగంలో

కోఠి ఈఎన్‌టీ వైద్యుడికి అంతర్జాతీయ అవార్డ్‌

  • హైడ్రా 2021కు ఎంపికైన డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి జనరర్స్‌
  • ముక్కు వెనుక భాగంలో సోకే ఇన్‌ఫెక్షన్‌పై అధ్యయనం 

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : తలనొప్పికి రకరకాల కారణాలు ఉంటాయి. ముక్కు వెనుక భాగంలో కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందని, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుందని కోఠి ఈఎన్‌టీ వైద్యులు గుర్తించి దానిపై అధ్యయనం చేశారు. తలనొప్పి సమస్యతో చాలా మంది రోగులు ఈఎన్‌టీకి వస్తుంటారు. వారిలో కొందరికి ఆ నొప్పి ఎలా వస్తుందనేది ఎన్ని పరీక్షలు చేసినా ఒక్కోసారి అంతుపట్టదు. ముక్కు వెనుక భాగంలో కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందనేది ఎన్నో పరీక్షల తర్వాత వెలుగులోకి వచ్చింది. 100 మందిలో ఐదుగురికి దీని వల్ల తలనొప్పి వస్తుందని ఈఎన్‌టీ వైద్యులు గుర్తించారు. ఇన్‌ఫెక్షన్‌ను తొలగించే విధానంపై ప్రత్యేకంగా పరిశోధనాపత్రం రాశారు. అది అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయింది.


ఆలస్యం చేస్తే ప్రమాదం

ముక్కు వెనక భాగంలో ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించేందుకు సీటీ స్కాన్‌ చేసి కంటికి వెళ్లే పొరలు, రక్త ప్రసరణ జరిపే నరాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ సర్జరీ ద్వారా క్లీన్‌ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసే సమయంలో పొరలకు తగిలితే కంటి చూపుపోయే ప్రమాదం ఉంటుంది. అదే నరాలకు తగిలితే తీవ్ర రక్త స్రావమై ఆపరేషన్‌ థియేటర్‌లోనే రోగి మరణించే ప్రమాదం ఉంటుందని ఈఎన్‌టీ వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స సమయంలో చాలా జాగ్రత్తగా ముక్కు వెనకాల ఉన్న సన్నటి ఎముకను తొలగించి ఇన్‌ఫెక్షన్‌ను శుభ్రం చేసి, తిరిగి రాకుండా చేయాల్సి ఉంటుంది. 


ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు ఈ సమస్యకు పూర్తి స్థాయిలో చెక్‌ పెట్టవచ్చని ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. శస్త్ర చికిత్సకు దాదాపు గంటకు పైగా సమయం పడుతుందని, రోగిని డిశ్చార్జ్‌ చేసిన వారం రోజుల తర్వాత మరోసారి పరిశీలించాల్సి ఉంటుందని వెల్లడించారు. ముక్కు వెనకాల ఇన్ఫెక్షన్‌ రావడం అత్యంత అరుదని వివరించారు. ఇదే అంశంపై రాసిన వ్యాసం గతేడాది నవంబర్‌ 14న ‘‘ఇంటర్నేషన్‌ ఐసోలేటెడ్‌ సఫైనోయిడ్‌ సైనస్‌ - ది కల్‌ప్రిట్‌ ఇన్‌ డయాగ్నొసిస్‌ ఫర్‌ ఇంట్రాక్టబుల్‌ హెడేక్‌’’ శీర్షికతో ప్రచురితమైంది. దీంతో పాటు ఇతర ఈఎన్‌టీ సమస్యలు, వాటి పరిష్కారాలతో మొత్తం 32 రీసెర్చ్‌ థీరీలు సమర్పించగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితం అయ్యాయి. 


హైడ్రా 2021 సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపిక

ఏటా హైడ్రా (హెచ్‌వైడీఆర్‌ఏ) పేరుతో ఇచ్చే అవార్డు కోసం ఇంటర్నేషనల్‌ సైంటిస్ట్‌ అవార్డ్‌ ఆన్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలను సెలెక్షన్‌ కమిటీ పరిశీలిస్తుంది. ఎంపికైన ఆర్టికల్స్‌ను సమర్పించిన వైద్యులకు ‘సైంటిస్ట్‌ అవార్డు’ను అందజేస్తుంటుంది. ఇందులో భాగంలో 2021 సంవత్సరానికి గా ను కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి ఈఎన్‌టీ హెచ్‌ఓడీ, ప్రొ ఫెసర్‌ డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి సమర్పించిన పత్రాలు ఎంపికయ్యాయి. అక్టోబర్‌ 22, 23 తేదీల్లో నగరంలో జరిగే ఆవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రెస్టీజెస్‌ సైంటిస్ట్‌ అవార్డును సుదర్శన్‌ రెడ్డి అందుకోనున్నారు.


బ్లాక్‌ ఫంగస్‌పై అధ్యయనం చేస్తున్నాం

కరోనా రోగుల్లో షుగర్‌ అదుపు తప్పి ఫంగస్‌ వ్యాప్తిఅధికంగా ఉంటోంది.  ఇప్పటి వరకు కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వచ్చిన 100 మందిలో 96 మందికి షుగర్‌ ఉండడం, వారికి కొవిడ్‌ తగ్గిన వెంటనే బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో ఇతర సమస్యలు వస్తున్నట్లు గుర్తించాం. బ్లాక్‌ ఫంగస్‌ రోగుల రికార్డులను పరిశీలించి వాటిపై అధ్యయనం చేస్తున్నాం. కరోనా సోకిన సమయంలో వారు వాడిన మందులు, కరోనా రాక ముందు షుగర్‌ ఏ స్థాయిలో ఉంది, ఇతర వ్యాధులు ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నాం. కరోనా సోకిన వారికి ఫంగస్‌ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరిశోధనా సిద్ధాంతాన్ని త్వరలో సమర్పించనున్నాం. -  డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి

Updated Date - 2021-06-19T18:54:51+05:30 IST