దశ మారేనా?

ABN , First Publish Date - 2021-02-27T04:35:03+05:30 IST

పదేళ్లుగా కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు నోచడం లేదు.

దశ మారేనా?
కోట్‌పల్లి ప్రాజెక్టు

  • పదేళ్లుగా ఆధునికీకరణకు నోచని కోట్‌పల్లి ప్రాజెక్టు 
  • ప్రతిపాదనలు బుట్టదాఖలేనా...?
  • శిథిలమైన తూములు, పూడుకుపోయిన కాలువలు
  • నీరందక వేరుశనగ సాగుకు దూరం
  • ఏటేటా తగ్గుతున్న ఆయకట్టు.. ఆందోళనలో రైతులు


పదేళ్లుగా కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు నోచడం లేదు. ఆయకట్టుకు నీరందించే కాలువలు పూడుకుపోయాయి. పిచ్చిమొక్కలతో కాలువల స్వరూపమే మారింది. తూములు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు లేక ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసుకోలేకపోయారు. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీరు చేరినా శిథిలమైన కాలువల వల్ల నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్టు ఆధునికీకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసే రైతులకు ప్రతిఏటా నిరాశ తప్పడం లేదు. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కోట్‌పల్లి... ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు కింద బాగా పంటలు పండించిన ఆయకట్టుదారులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు నిర్మించి అర్ధ శతాబ్దం గడిచినా ఇంతవరకు సరైన మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఇంతవరకు రూపొందించిన ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందక రైతులు ఈ ప్రాజెక్టుపై ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరినా ఉపయోగం లేకుండా పోతోంది. కోట్‌పల్లి ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకువచ్చే విషయమై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉత్తర తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై చూపుతున్న శ్రద్ధ ఒక శాతమైనా ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై చూపితే కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.


కోట్‌పల్లి సాగునీటి ప్రాజెక్టుకు పాలకుల కరుణ కరువైంది. 9,200 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలనే ఉన్నత లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం 4వేల ఎకరాలకు కూడా నీరందించలేని పరిస్థితి ఉంది. పెద్దేముల్‌ మండలం, కోట్‌పల్లి వాగుపై 1964లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించారు. కోట్‌పల్లి ప్రాజెక్టు 1784 ఎకరాల్లో విస్తరించి 24 అడుగుల లోతు కలిగి ఉండగా, 1.572 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిఉంది. కుడి, ఎడమ, బేబీ కెనాల్‌ అనే మూడు కాలువల ద్వారా 18 గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కుడి కాలువ కింద 8,100 ఎకరాలు, ఎడమ కాలువ, బేబీ కాలువల కింద 1,100 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ఏర్పాటు చేసిన ప్రారంభంలో కుడికాలువ కింద ధారూరు మండలంలోని నాగసమందర్‌, అల్లాపూర్‌, రుద్రారం, బూర్గుగడ్డ, గట్టెపల్లి గ్రామాలు ఉన్నాయి. ఎడమ కాలువ కింద పెద్దేముల్‌ మండలంలోని మన్‌సాన్‌పల్లి, మారెపల్లి, దుగ్గాపూర్‌, రుక్మాపూర్‌, కొండాపూర్‌, ఖానాపూర్‌, రేగొండి, మదనంతాపూర్‌, జనగాం, మంబాపూర్‌, తింసాన్‌పల్లి, బుద్దారం, పెద్దేముల్‌, గ్రామాలు ఉన్నాయి. బేబీ కెనాల్‌ కింద నాగసమందర్‌, బూర్గుగడ్డ సగభాగం, ఎడమకాలువ కింద రుద్రారం, గట్టెపల్లి సగభాగం నీరు అందేది. అయితే ప్రస్తుతం ఈ గ్రామాల్లో చాలా వరకు ఆయకట్టుకు నీరందడం లేదు. 


లక్ష్యం ఘనం.. చేరేది సగం

వికారాబాద్‌ జిల్లాకే మణిహారంగా నిలిచిన కోట్‌పల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాక మరమ్మతులకు నోచుకోవడం లేదు. కల్వర్టులు, తూములు శిథిలావస్థకు చేరుకోగా, చాలాచోట్ల కాలువలు పూడుకుపోయాయి. ప్రాజెక్టు నీరు వదిలినప్పుడు ఆయకట్టులో చివరి పొలం వరకు పారాల్సిన నీరు.. చాలాచోట్ల కాలువలు సక్రమంగా లేక వృథాగా పోతోంది. 9,200 ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో కోట్‌పల్లి ప్రాజెక్టును నిర్మించారు. మొదట్లో ప్రాజెక్టు నుంచి రబీ సీజన్‌లో నీరు వదలకుండా ఖరీఫ్‌ (ప్రస్తుత వానాకాలం సీజన్‌)లో 7500 ఎకరాలకు నీరందించారు.  ఆ తరువాత 1996 నుంచి బుద్దారం, తింసాన్‌పల్లి గ్రామాల పరిధిలోని 1,100 ఎకరాలకు సాగునీటిని అందించలేమని ఆయకట్టు నుంచి తొలగించారు. తరువాత ఆరుతడి పంటలు సాగుచేసే 4,600 ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలిగారు. ప్రస్తుతం 4 వేల ఎకరాలకు కూడా సక్రమంగా నీరందంచలేని పరిస్థితి ఏర్పడింది. ఆయకట్టుకు నీరందక చాలామంది రైతులు వేరుశనగ పంటను వేయడం లేదు. గతంలో రబీలో 6వేల ఎకరాల వరకు వేరుశనగ పంట సాగు చేసేవారు. నీరు అందక ఆ పంటను వేయడమే మరిచిపోయారు. 


ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలేనా...?

కోట్‌పల్లి ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఏడేళ్ల కిందట జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ ఏజెన్సీ (జైకా) ఆర్థిక సహాయం కోరుతూ రూ.29 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. జైకా నిధులు మంజూరు కోసం అప్పటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చినా ఫలితం లేకుండాపోయింది. ఆ తరువాత మూడేళ్ల కిందట కోట్‌పల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇతర సాగునీటి ప్రాజెక్టులకు శరవేగంగా అనుమతులు, నిధులు మం జూరు చేస్తున్న సీఎం కేసీఆర్‌... రాష్ట్ర రాజధానికి వంద కిలోమీటర్ల దూ రంలో ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టుపై దృష్టి సారించకపోవడం శోచనీయమని ఆయకట్టుదారులు విమర్శిస్తున్నారు.


పంటలకు అందని ప్రాజెక్టు నీరు

ఒకప్పుడు కోట్‌పల్లి ప్రాజెక్టు కింద వేరుశనగ పంటలు పండించి మంచి ఆదాయం పొందే వాళ్లం. ఇప్పుడు కాలువ పూర్తిగా శిథిలమై పంటలకు నీరందడం లేదు. అందుకే ప్రాజెక్టు నీటిపై ఆశలు వదులుకొని వర్షాధార పంటలు సాగు చేస్తున్నాం. ప్రాజెక్టు నీరు వస్తే చాలా బాగుంటుంది. పాడైపోయిన కాలువలు, తూములు బాగుచేయాలి

- మంతటి బుగ్గయ్య, మంబాపూర్‌, పెద్దేముల్‌ మండలం.


వేరుశనగ సాగు చేయక పదేళ్లు..

కోట్‌పల్లి ప్రాజెక్టు కింద వేరుశనగ పంట వేయక సుమారు పదేళ్లవుతోంది. కాలువలు పూర్తిగా పూడుకుపోవడం వల్ల పంటలకు నీరందడం లేదు. ప్రాజెక్టు నీరు వస్తే వేరుశనగ పంట వేసేవాళ్లం. ఇప్పుడు వర్షాధార పంటలు వేసుకుని నష్టాలకు గురవుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి.

- గొబ్బురు దస్తప్ప, ఆయకట్టు రైతు, మంబాపూర్‌ 



Updated Date - 2021-02-27T04:35:03+05:30 IST