ఘనంగా ‘కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం’

Aug 2 2021 @ 17:57PM

సింగపూర్: "వంశీ ఇంటర్నేషనల్", "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్, "తెలుగు కళా సమితి" ఒమాన్, "సంతోషం ఫిలిం న్యూస్" వారి ఆధ్వర్యంలో డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, అమెరికా సహకారంతో "అంతర్జాతీయ కవి సమ్మేళనం" ఘనంగా జరిగింది. ఆదివారం అంతర్జాలంలో అద్భుతంగా 12 గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రం నిర్వహించారు. ఈ  "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. 

అందరినీ అలరించిన ఈ కార్యక్రమానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, సాహితీవేత్త, కె.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి  ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌తోపాటు ప్రత్యేక అతిథులుగా "తెలంగాణ సారస్వత పరిషత్" కార్యదర్శి జె. చెన్నయ్య, "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, "ఒమాన్ తెలుగు కళా సమితి" కన్వీనర్ అనిల్ కుమార్, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక, వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని, కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేశారు. 

భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డికి కవితా నివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాల నుంచి ఎంతో మంది కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా అందరినీ ఆకర్షించింది. 

కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు మాట్లాడుతూ "వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం వలే ఈ సంవత్సరం నుంచి "కొత్త కవిత" అనే కవితా సంకలనం తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డా.ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో త్వరలో ఈ కార్యక్రమంలో చదవబడిన కవితలన్నీ, కవితా సంకలనంగా ముద్రించబడతాయి" అని తెలిపారు. 


కార్యక్రమ సహ నిర్వాహకులు "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "సింగపూర్ నుంచి తొలిసారి ఈ కార్యక్రమంలో 14 మంది కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉంది" అని ఆనందం వ్యక్తం చేశారు. 

కాగా రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో ప్రారంభసమావేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల కవితా పఠనం కొనసాగగా,  ఆఫ్రికా ఐరోపా ఖండాల వారికి పీసపాటి జయ, మధ్య ఆసియా దేశాలవారికి కొండూరు కళ్యాణి, కెనడా వారికి రాయవరపు లక్ష్మి, అమెరికా వారికి నోరి రాధిక సహవ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.