కొత్త పిట్టలొస్తాయి

ABN , First Publish Date - 2021-10-25T06:04:38+05:30 IST

ఇంత పచ్చి గడ్డి పక్కనో సమూహంగా చేరిన కాసిన్ని నీళ్ల ముందో మొక్కల్లా మనసులను, నాలుగు గోడల మధ్య బిగుసుకుపోయిన మౌనాన్ని...

కొత్త పిట్టలొస్తాయి

ఇంత పచ్చి గడ్డి పక్కనో

సమూహంగా చేరిన కాసిన్ని నీళ్ల ముందో

మొక్కల్లా మనసులను,

నాలుగు గోడల మధ్య బిగుసుకుపోయిన మౌనాన్ని

ఒక సాయంత్రం పూట

చెరుకుగడ తోలును చీల్చి

జీవితాన్ని తియ్యగా చేసుకోవాలి


మట్టిలో ఇన్ని అడుగులు వేసిన తర్వాత

ఒక చెట్టు వినపడుతుంది

చెట్టు కింద గాయాలు మాట్లాడుకోవడం

స్పష్టంగా, స్ఫటికంలా మెదలాడి 

కాలపు తోటలో

రాలిన పువ్వుల భారతాన్ని

ఒక్కొక్కటిగా వేళ్ళ మధ్య కూర్చబడతాయి


ఎన్నో రోజుల నుండో, నెలల నుండో

పాసిపోయిన మూటను తెచ్చుకున్న

రెండు పిట్టలు

ఆత్రుతగా, ఆవేశంగా విప్పతాయి

కాసేపటికి రెక్కలూపుకుంటూ

ఒక దాని గుండెలో ఒకటి

ఒక దాని రెక్కలో మరొకటి దూరుకొని 

ఆకాశానికి గురిపెడతాయి


ఆ పక్కనే

అక్షరాల కుండను గుద్దుతాడొకడు

వెనక్కి తిరిగి

నీ నడక, నీ గమ్యం, నీ చూపు

            ఆ పక్కకి సర్దుకో అంటాడు.

అది చాలదా ఒక పద్యం రాయడానికి?


తన్నడానికి సందర్భం, స్థలమెందుకు?

తప్పుపట్టడానికి ఏ చోటైతే ఏంటి?

అతను మాత్రమే కాదు

ఆమె కూడా తంతోంది, ఆమె కూడా గుచ్చుతోంది,

ఆమె కూడా తొడలను పైకెత్తి

గుండెలపై గుద్దుతోంది


శరీరాలు అలసి, చూపులు నలిగి

ఒకరి మూతుల్లో ఇంకొకరు దూరిన తర్వాత

అతని చేతులు ఆమెలోకి ఇంకిన తర్వాత

ఒక ఖాళీ స్థలం ఎడారిగా ఏర్పడుతుంది


రేపు మళ్ళీ

కొత్త పిట్టలు వస్తాయి

కీచ్‌ కీచ్‌ మని అరుసుకొని, కరుసుకొని

ఇంకా ఏందో?!

జె.బి

72595 11956

Updated Date - 2021-10-25T06:04:38+05:30 IST