కొవిడ్‌ మృతుల లెక్క తేలేనా?

ABN , First Publish Date - 2021-11-10T05:12:41+05:30 IST

కొవిడ్‌ మృతుల సంఖ్యని దాచి పెట్టిన ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతోంది.

కొవిడ్‌ మృతుల లెక్క తేలేనా?
కలెక్టరేట్‌లో దరఖాస్తులు అందజేసేందుకు వచ్చిన కొవిడ్‌ మృతుల కుటుంబ సభ్యులు

కొవిడ్‌ పరిహారానికి దరఖాస్తుల వెల్లువ

కొవిడ్‌ మృతులు కేవలం 1,310 మందేనంటున్న ప్రభుత్వం 

రెండు రోజుల్లో 2,506 మంది దరఖాస్తు

ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన బాధిత కుటుంబాలు ఎన్నో!

గుంటూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మృతుల సంఖ్యని దాచి పెట్టిన ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతోంది. ఇప్పటివరకు అధికారికంగా 1,310 మంది మాత్రమే చనిపోయారని పేర్కొంటూ వస్తోంది. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలిచ్చిది. దీంతో సోమ, మంగళవారాల్లోనే 2,056 మంది జిల్లా కలెక్టరేట్‌కి వచ్చి స్పందనలో దరఖాస్తు చేసుకొన్నారు. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరో పదిరెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  

కొవిడ్‌ తొలి, రెండో దశల ప్రభావం జిల్లాపై ఎక్కువగా పడింది. ఒకదశలో రోజుకు అధికారికంగానే రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా అనధికారికంగా ఈ సంఖ్య 10 వేల వరకు వెళ్లింది. ఆస్పత్రుల్లో పడకలు లభ్యం కాని పరిస్థితి కూడా ఉత్పన్నమైంది. దాంతో మరణాలు కూడా పెద్దఎత్తున సంభవించాయి. ఒక్కో కోవిడ్‌ ఆస్పత్రిలో రోజుకు 20 నుంచి 30 మరణాలు చోటు చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి. కొవిడ్‌ మొదటి దశ 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు పరిగణిస్తున్నారు. ఈ వ్యవధిలో 2020 ఏప్రిల్‌లో 9, మేలో 1, జూన్‌లో 15, జూలైలో 175, ఆగస్టులో 246, సెప్టెంబరులో 151, అక్టోబరులో 84, డిసెంబరులో 21, 2021 జనవరిలో 5, ఫిబ్రవరిలో 2 మరణాలను అధికారికంగా ప్రకటించారు. కొవిడ్‌ రెండో దశ 2021 మార్చి నుంచి ప్రారంభం కాగా ఆ నెలలో 5, ఏప్రిల్‌లో 49, మేలో 221, జూన్‌లో 144, జూలైలో 55, ఆగస్టులో 39, సెప్టెంబరులో 27, అక్టోబరులో 27, నవంబరులో ఇప్పటివరకు 8 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల విషయంలోనూ కొవిడ్‌ మృతుల సంఖ్యని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఇప్పటివరకు పరిహారం కోసం వచ్చిన దరఖాస్తుల్లో సాంకేతిక కారణాలతో కొన్నింటిని ప్రభుత్వం నియమించిన కమిటీ తిరస్కరించినా బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. 


Updated Date - 2021-11-10T05:12:41+05:30 IST