అదుపులో కొవిడ్‌

Sep 20 2021 @ 02:37AM

రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు

పండుగలు, శుభకార్యాలు జరుగుతున్నా..,

విద్యా సంస్థలు తెరిచినా కరోనా కేసులు లేవు

ప్రమాదకర వేరియంట్‌ వస్తేనే థర్డ్‌ వేవ్‌

మార్చి దాకా ఉండదు.. వచ్చినా తక్కువే!

ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతం

నాలుగు రోజుల్లోనే 20 లక్షలమందికి టీకా

నెల రోజుల్లో కోటి మందికి పంపిణీ చేస్తాం

మే నుంచి ఆరు సార్లు జ్వర సర్వే చేశాం

20 లక్షల మందికి మెడికల్‌ కిట్ల పంపిణీ

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు


హైదరాబాద్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తిరేటు 0.48 మాత్రమేనని, పండుగలు, శుభకార్యాలు జరుగుతున్నా, విద్యా సంస్థలు తెరిచినప్పటికీ కేసులు నమోదు కావడం లేదని పేర్కొన్నారు. మూడు నెలలుగా పెద్దగా కేసులు లేనప్పటికీ రోజుకు 50 వేలపైగా టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌లు పెరిగినచోట్ల మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.  ప్రమాదకరమైన కొత్త వేరియంట్స్‌ బలంగా పుట్టుకువస్తేనే కొవిడ్‌ మరో వేవ్‌కు అవకాశాలుంటాయన్నారు. మార్చి వరకుథర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా తీవ్రత అంతగా ఉండదని వివరించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌, ఽథర్డ్‌ వేవ్‌  అంచనా, పిల్లలకు టీకా తదితరాలపై గడల శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


కొవిడ్‌ను ఎలా సమర్థంగా ఎదుర్కొన్నారు?

సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కాగానే అప్రమత్తమయ్యాం. కేవలం పరీక్షల నిర్వహణ మీదనే ఆధారపడలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా మే 6 నుంచి వెంటవెంటనే ఆరుసార్లు జ్వర సర్వే నిర్వహించాం. 23,560 బృందాలు 5,32,23,439 ఇళ్లలో సర్వే చేశాయి. 6.06 లక్షల మంది కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించాం. వీరికి 6,38,421 మెడికల్‌ కిట్లు ఇచ్చాం. ఐసొలేషన్‌లో ఉంచాం. అన్ని పీహెచ్‌సీల్లో 95 లక్షల కొవిడ్‌ ఓపీలు నిర్వహించాం. కేవలం పీహెచ్‌సీల్లోనే 14.02 లక్షలమందికి మెడికల్‌ కిట్లు ఇచ్చాం. మొత్తం 20 లక్షల మెడికల్‌ కిట్లు పంపిణీతో పాటు ఆరోగ్యంపై ఫాలోఅప్‌ చేశాం. సకాలంలో పరీక్షల సంఖ్యను పెంచాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 52 వేల పడకలు సిద్ధం చేసిపెట్టుకున్నాం. 550 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకున్నాం. అందుకే ఇతర రాష్ట్రాల తరహాలో.. మనదగ్గర ఆక్సిజన్‌కు, పడకలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాలేదు. దీనికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు, మార్గనిర్దేశం. 


అక్టోబరు-నవంబరులో థర్డ్‌వేవ్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు? రాదని మీరంటున్నారు?

దేశంలో డెల్టా వేరియంట్‌ కారణంగా తీవ్రమైన సెకండ్‌వేవ్‌ వచ్చింది. మరో వేవ్‌కు అంతకంటే బలమైన వేరియంట్‌ పుట్టాలి. వైరస్‌ మ్యుటేషన్‌ అనూహ్యంగా జరిగి కొత్త వేరియంట్‌ ఉద్భవించినా, వచ్చే ఆరు నెలలు అంత ప్రమాదకరం కాకపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో వ్యాక్సినేషన్‌ జోరుగా నడుస్తోంది. దీనివల్ల కొత్త వేరియంట్‌ పుట్టుకకు అవకాశం తక్కువగా ఉంటుంది. దేశంలో డిసెంబర్‌ నాటికి వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తవుతుంది. మన రాష్ట్రంలో వచ్చే నెలలో అందరికీ ఒక డోసు పంపిణీ పూర్తవుతుంది. గతంలో మహమ్మారులు ఒకటి, రెండుసార్లే తీవ్ర ప్రభావం చూపాయి. రాబోయే రోజుల్లో కొవిడ్‌ వైరస్‌ ‘ఎండెమిక్‌’గా మారే అవకాశం ఉంది. అంటే ఏదో ఒకటి రెండు దేశాలకో, ప్రాంతాలకో పరిమితమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఓ సాధారణ ఫ్లూ, సీజనల్‌ వ్యాధిగా మిగిలిపోతుంది. కనుక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. 


థర్డ్‌వేవ్‌ తీవ్రత ఎలా ఉంటుంది?

ఇప్పటికే టీకా కార్యక్రమం వేగంగా నడుస్తోంది. కాబట్టి థర్డ్‌వేవ్‌ వచ్చినా తీవ్రత అత్యంత తక్కువగా ఉంటుంది. మరణాలు, ఆస్పత్రుల పాలయ్యే ముప్పు చాలా స్వల్పం. పిల్లల్లో ఉండే సహజ రోగ నిరోధక శక్తికి తోడు, సీరో సర్వేలో వారిలో భారీగా యాంటీబాడీలున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌లో చిన్నారులు వైరస్‌ బారినపడినా.. తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.


థర్డ్‌వేవ్‌ వస్తే ఎలా ఎదుర్కొనబోతున్నారు?

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతకు సీఎం కేసీఆర్‌ రూ. 500 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అన్ని పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మారుస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. 200 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంటును అదనంగా అందుబాటులో ఉంచాం. రైలు, రోడ్డు మార్గాల్లో 460 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ రవాణాకు 27 ఐఎ్‌సవో కంటైనర్లను సేకరించి పెట్టుకున్నాం. మరో 200 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నాం. నీలోఫర్‌ ఆస్పత్రిలో 2 వేల పడకలను చిన్నారులు కోసం సిద్ధం చేశాం. వారికోసం 66 రకాల ఔషధాలతో పాటు, 24 రకాల పరీక్ష యంత్రాలను సిద్ధం చేసుకుంటున్నాం.


12-18 ఏళ్ల పిల్లలకు టీకాలెప్పుడు వస్తాయి?

మా అంచనా మేరకు మరో 2-3 వారాల్లో 12-18 ఏళ్ల పిల్లలకు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆ వయసు వారు 49 లక్షల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌తో వారందరికీ టీకాలేస్తాం. 2-12 ఏళ్ల మధ్య చిన్నారులకు టీకా 3-4 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. వీరికీ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా పంపిణీ చేస్తాం.


వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఎలా నడుస్తోంది? 

ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. 4 రోజుల్లోనే 20 లక్షల మందికి టీకాలిచ్చాం. ఒక్కో పీహెచ్‌సీ నుంచి ఒక్కో బృందం చొప్పున  మొత్తంగా 7,319 బృందాలు పనిచేస్తున్నాయి. దీనిద్వారా 80-90 శాతం మందికి టీకా అందేలా చూస్తాం. నెల వ్యవధిలో కోటిమందికి టీకాను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకా మిగిలినవారి కోసం మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహిస్తాం. ఆటో డిజేబుల్‌ సూదుల కొరతను అధిగమించాం. శనివారం 16లక్షల సిరంజీలు వచ్చాయి. మరో 5లక్షల సిరంజీలు రెండు రోజుల్లో రానున్నాయి.


సీజనల్‌ వ్యాధుల పరిస్థితి ఎలా ఉంది?

కొన్ని ప్రాంతాల్లో డెంగీ, మలేరియా కేసులు పెరిగిన మాట వాస్తవమే. కానీ, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నాం. క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు అదుపులోనే ఉన్నాయి. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ దోమల నిరోధక చర్యలు చేపడుతున్నాం.

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.