ఆ ఊరిపై కొవిడ్‌ పంజా..!

ABN , First Publish Date - 2021-05-09T05:34:56+05:30 IST

మండల పరిధిలోని రూపనగుడి గ్రామంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కొవిడ్‌ సోకింది.

ఆ ఊరిపై కొవిడ్‌ పంజా..!
రూపనగుడి ఏరియల్‌ వ్యూ

  1. యాభైశాతం మందికి పాజిటివ్‌
  2. రూపనగుడిని కబళించిన వైరస్‌


ఉయ్యాలవాడ, మే 8: మండల పరిధిలోని రూపనగుడి గ్రామంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కొవిడ్‌ సోకింది. గ్రామంలో ఏకంగా 50 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 4వ తేదీన 70 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఫలితాలు శనివారం వచ్చాయి. 36 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో ఇప్పటి వరకు 100 మందికి  కొవిడ్‌ పరీక్షలు చేయగా, 50 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఉయ్యాలవాడ మండలం రూపనగుడి మినహా 20 గ్రామాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 1,600 మందికి  కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 339 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మండల వ్యాప్తంగా పాజిటివ్‌ రేటు 21.18 శాతం ఉండగా, ఒక్క రూపనగుడిలో మాత్రమే 50 శాతం ఉంది. గ్రామంలో 10 రోజుల క్రితం కొవిడ్‌ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఊరిలో చాలా మంది దగ్గు. జలుబులతో బాధపడుతున్నారు.
ఫ కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదు. మధ్యాహ్నం 12 తరువాత కూడా కిరాణ అంగళ్లు తెరుస్తున్నారు. సాయంత్రం వేళల్లో రచ్చబండలు, బస్టాండు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలు గుంపులు కడుతున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు.


చర్యలు తీసుకుంటున్నాం..
మండలంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కర్ఫ్యూను అమలు చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తున్నాం. ప్రజల సహకారం కూడా కావాలి. రూపనగుడిపై ప్రత్యేక దృష్టి పెట్టి కర్ఫ్యూ అమలును కఠినతరం చేస్తాం.
- సుభద్ర, తహసీల్దారు, ఉయ్యాలవాడ


వైద్యసేవలు అందిస్తున్నాం..
రూపనగుడిలో కరోనా విజృంభిస్తున్న మాట వాస్తవమే. పాజిటివ్‌ వచ్చిన వారిలో కొంత మందికి మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు ఉన్న 15 మందిని వివిధ వైద్యశాలలకు తరలించాం. మిగిలిన వారిని హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచి మందులు ఇచ్చాం. వైద్య సిబ్బంది ద్వారా పర్యవేక్షిస్తున్నాం. గ్రామంలో ప్రైమరీ కాంటాక్టు ఉన్న వారిని, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేస్తాం.  
- డాక్టర్‌ బాబు, వైద్యాధికారి, మాయలూరు


Updated Date - 2021-05-09T05:34:56+05:30 IST