రాష్ట్ర జనాభాలో 30% మందికి కొవిడ్‌!

ABN , First Publish Date - 2022-01-12T07:41:50+05:30 IST

శరవేగంగా వ్యాపించే ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది.

రాష్ట్ర జనాభాలో 30% మందికి కొవిడ్‌!

  • ఫిబ్రవరి 15 నాటికి కేసులు పతాక స్థాయికి
  • తర్వాత తగ్గుదల.. రాష్ట్ర వైద్యశాఖ అంచనా
  • పాజిటివ్‌లలో 95 శాతం లక్షణాలు లేని వారే..
  • ఆదివారమూ టీకాలు, తగిన సంఖ్యలో పరీక్షలు
  • రాత్రి 10 గంటల దాకా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌
  • టెలీ కాన్ఫరెన్స్‌లో వైద్యఆరోగ్య మంత్రి హరీశ్‌రావు
  • ‘గాంధీ’లో సాధారణ రోగుల అడ్మిషన్లు నిలిపివేత
  • మరోసారి పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా మార్పు!
  • విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా
  • రాష్ట్రంలో కొత్త కేసులు 1,920.. ఇద్దరు మృతి


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): శరవేగంగా వ్యాపించే ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. దీని స్వభావం రీత్యా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 30ు జనాభాకు వైర్‌స సోకే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. సంక్రాంతి తర్వాత కేసులు పెద్దసంఖ్యలో వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఆస్పత్రులను సంసిద్ధం చేస్తోంది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. ఆదివారమూ టీకా పంపిణీ చేపట్టాలని, పరీక్షలు తగ్గకుండా చూడాలని నిర్ణయించింది. 


అందుకే ఆస్పత్రుల్లో చేరికలు తక్కువ

డెల్టాతో పోల్చితే 70 రెట్లు వైరస్‌ లోడ్‌ ఎక్కువ అయునప్పటికీ.. ఒమైక్రాన్‌ వేరియంట్‌ గొంతులోనే ఉంటోందని.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదని వైద్య నిపుణులంటున్నారు. అందుకే కేసుల్లో 90ు మందికి పైగా ఆస్పత్రుల్లో చేరడం లేదని పేర్కొంటున్నారు. వచ్చేనెల 15 నాటికి రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ పతాక స్థాయికి చేరుతుందని వైద్య శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తోంది.


యాంటీజెన్‌లో బయటపడని ఒమైక్రాన్‌

ప్రస్తుత పాజిటివ్‌లలో 95% లక్షణాలు లేనివారేనని.. వీరితోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతున్నట్లు వైద్య శాఖ అభిప్రాయపడుతోంది. ఈ కేసుల్లో 70ు పైగా ఒమైక్రాన్‌వేనని వెల్లడించింది. ఈ వేరియంట్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో నిర్ధారణ కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. వీరికి ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలుతోందని వివరిస్తున్నారు. 


టెస్టులు, టీకాపై ప్రభుత్వ కీలక నిర్ణయం

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం కూడా కరోనా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని, పరీక్షలు తగ్గకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం ఉన్నతాఽఽధికారులు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌వోలు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ తగ్గేవరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్‌ సీలు, సబ్‌-సెంటర్లు ఆదివారం కూడా పనిచేయాలన్నారు. లక్షణాలతో ఎవరొచ్చినా టెస్టు చేయాలని సూచించారు.


పాజిటివ్‌లకు హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ప్రతి పీహెచ్‌సీలో రాత్రి పదింటి వరకు వ్యాక్సినేషన్‌ చేపట్టాలని.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్‌సీలో ఉండి వైద్య సేవలందించాలన్నారు. కొవిడ్‌ కాలంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన గర్భిణుల కోసం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా పిల్లలంతా గ్రామాల్లో ఇళ్లవద్దనే ఉంటారని, పీహెచ్‌సీ వైద్యులు వారి దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలైన మునిసిపల్‌ సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాల వారికి ముందుజాగ్రత్త డోసు 100ు పూర్తి చేయాలన్నారు.


గాంధీకి 25 సీరియస్‌ కేసులు

గాంధీ మరోసారి పూర్తిస్థాయిలో కొవిడ్‌ ఆస్పత్రిగా మారనున్నట్లు తెలుస్తోంది. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలన్నింటిని నిలిపివేస్తూ సూపరింటెండెంట్‌ మంగళవారం అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాధారణ కేసుల అడ్మిషన్లను నిలిపివేశారు. ఇప్పటికే కోలుకుని  పర్యవేక్షణలో ఉన్నవారిని డిశ్చార్జ్‌ చేయనున్నారు. వైద్య సిబ్బంది అందరికీ సెలవులు రద్దు చేశారు. నర్సింగ్‌ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. కొన్ని రోజులు కొవిడ్‌ నిబంధనలతో నాన్‌ కొవిడ్‌ ఓపీలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం గాంధీకి 25 కొవిడ్‌ సీరియస్‌ కేసులు వచ్చాయి. వీరంతా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులే. ప్రస్తుతం 71 మంది చికిత్స పొందుతున్నారు.    కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఆ మేరకు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, గాంధీలోలాగా అన్ని ఆస్పత్రుల్లోనూ వ్యవహరించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆస్పత్రుల్లో అన్నిరకాల రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. కాగా, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని వైద్య కళాశాలలో 90 మంది విద్యార్థులకు కరోనా సోకిందని, హాస్టల్‌లో 12 మంది విద్యార్థినులకు పాజిటివ్‌ వచ్చిందని రోహిత్‌ కిరీటీ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. ఇతడు కళాశాల విద్యార్థి కానీ, పరిసర వాసి కానీ కాదు. అయితే, కళాశాలలో కేసులు లేవని యాజమాన్యం తెలిపింది. తప్పుడు ట్వీట్‌ చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


మంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో ఐసొలేట్‌ అయ్యారు. కాగా, రాష్ట్రంలో మంగళవారం 83,153 మందికి పరీక్షలు చేయగా 1,920 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. మరో ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్‌లో 1,015, మేడ్చల్‌లో 209, రంగారెడ్డిలో 159, సంగారెడ్డి, హనుమకొండలో 55, ఖమ్మంలో 45 కేసులొచ్చాయి. 2.76 లక్షల మంది టీకా పొందారు. 1.61 లక్షల మంది రెండో, 24,685 మందికి ముందుజాగ్రత్త డోసు ఇచ్చారు. కేరళలోని శబరిమలై వెళ్లి వచ్చిన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాండ్ల సంకీసకు చెందిన 8 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన యువ రైతు రేషవేని పరశురాం (28) కరోనాతో మృతిచెందాడు.

Updated Date - 2022-01-12T07:41:50+05:30 IST