కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేంద్రాల్లో కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం
వ్యాక్సిన్‌ను చూపిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

-  రాజన్న సిరిసిల్లలో నాలుగు కేంద్రాల్లో 120 మందికి కొవిషీల్డ్‌ టీకాలు 

- ప్రశాంతంగా  పంపిణీ 

- దుష్ఫలితాలు ఏర్పడితే తక్షణమే చికిత్సకు సిద్ధం

- జిల్లా కేంద్రంలో ప్రారంభించిన జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

సిరిసిల్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):  రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేంద్రాల్లో కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వాస్పత్రితోపాటు  వేములవాడ, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో తొలి రోజు 30 మందికి ఇచ్చే విధంగా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేశారు. మొత్తం నాలుగు కేంద్రాల్లో 120 మందికి కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. జిల్లా కేంద్రంలో తొలి వ్యాక్సిన్‌ను సిరిసిల్ల ఐఎంఏ అధ్యక్షుడు, డాక్టర్‌ సురసుర రాధాకృష్ణ తీసుకున్నారు. తర్వాత పారిశుధ్య కార్మికురాలితోపాటు మిగతా వారు టీకాలు వేసుకున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగలేదు. డాక్టర్‌ రాధాకృష్ణ మాత్రం టీకా తీసుకున్న ఒక నిమిషంపాటు కొద్దిగా తిప్పినట్లు అనిపించిందని, అనంతరం ఇబ్బంది కలగలేదని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.  వ్యాక్సిన్‌ గురించి భయపడవద్దని సురక్షితమైందని అన్నారు.  జిల్లా  కృషభాస్కర్‌ మాట్లాడుతూ ముందుగా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎవరికైనా దుష్ఫలితాలు ఏర్పడితే తక్షణ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతకుముందు ప్రధాని ప్రసంగాన్ని విన్నారు.   అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ నీరజ పాల్గొన్నారు. 


ఇల్లంతకుంట:మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో శని వారం చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైంది.  జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారం భించారు.  మండలంలో 30మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ నమోదు చేసుకోగా అందరికీ టీకా వేశారు. తొలిటీకా స్టాఫ్‌నర్స్‌ చెప్యాల రేణుక, రెండో టీకాను వైద్యాధికారి ఆకుల సదానందం వేసుకున్నారు. టీకాలు వేసుకున్న వారికి ఎలాంటి దుష్పరిణామాలు లేవని పేర్కొన్నారు. ప్రత్యేకాధికారి శ్రీరాములు, ఏఎంసీ డైరెక్టర్‌ వేణురావు, సెస్‌డైరెక్టర్‌ అయిలయ్య ఉపాధ్యక్షడు శ్రీనాథ్‌, ఫ్యాక్స్‌ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ నర్సయ్యయాదవ్‌, తహసీల్దార్‌ రాజిరెడ్డి, ఎంపీడీవో విజయ, వైద్యాధికారులు సుభాషిణి, రామకృష్ణ, ఎస్సై రఫీక్‌ఖాన్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాదుల్‌ పాల్గొన్నారు.


తంగళ్లపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎంపీపీ పడిగెల మానస రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రారంభించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ సంతోష్‌కుమార్‌కు టీకా వేశారు. మొత్తం 30 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసేందుకు జాబితాను సిద్ధం చేశారు. వీరిలో ముగ్గురు వివిధ ఆరోగ్య సమ స్యలతో  ముందుకు రాలేదు. వారి స్థానంలో మరో ముగ్గురిని జాబితాలో చేర్చి 30 మందికి వేశారు. అంతకుముందు వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ కార్యక్రమాన్ని వీక్షించారు.  


వేములవాడ:  వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌-19 టీకా కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు ప్రారంభించారు.  తొలి టీకాను వైద్యాధికారి డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావుకు ఇచ్చారు.  తొలి రోజు 30 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా వేశారు.  జడ్పీటీసీ సభ్యుడు రవి, రూరల్‌ ఎంపీపీ  మల్లేశంయాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మాండ్లు, వైద్యులు నళినిశ్రీ, మానస, నీరజ,  సంతోష్‌, తిరుపతి, పట్టణ సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, సహకార సంఘం అధ్యక్షడు తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు మహేశ్‌,  శేఖర్‌, రాంచందర్‌,  శంకర్‌, ఉమారాణి, సంతోష్‌బాబు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST