అక్కడ ఫుల్‌..! ఇక్కడ డల్‌..!

ABN , First Publish Date - 2021-03-06T09:04:36+05:30 IST

కరోనా కష్టకాలంలో ఈ మాయదారి రోగానికి మందే లేదా.. అని హడలిపోయాం! వ్యాక్సిన్‌ సిద్ధమయ్యాక.. అది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆశగా ఎదురుచూశాం! తీరా

అక్కడ ఫుల్‌..! ఇక్కడ డల్‌..!

తెలంగాణలో వ్యాక్సిన్‌ కోసం జనం క్యూ

882 కేంద్రాల్లోనే 50 వేల మందికి వ్యాక్సిన్‌

ఒక్కో కేంద్రంలో సగటున 56 మందికి టీకా

మన రాష్ట్రంలో టీకాపై కనిపించని ఆసక్తి

2,228 కేంద్రాలున్నా 80 వేల మందికే 

ఒక్కో కేంద్రంలో సగటున 36 మందికే టీకా

కొనసాగుతున్న కొవిన్‌ వెబ్‌సైట్‌ కష్టాలు

రిజిస్ట్రేషన్‌ కాక లబ్ధిదారుల అవస్థలు

వ్యాక్సినేషన్‌లో ఆరోగ్య శాఖ విఫలం


కరోనా కష్టకాలంలో ఈ మాయదారి రోగానికి మందే లేదా.. అని హడలిపోయాం! వ్యాక్సిన్‌ సిద్ధమయ్యాక.. అది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆశగా ఎదురుచూశాం! తీరా అందుబాటులోకొచ్చాక పట్టించుకోవడం మానేశాం! ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను గమనిస్తే.. టీకాకు ఆశించిన మేర స్పందన రావడంలేదని స్పష్టమవుతోంది. టీకా తీసుకునేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ కూడా దీనిపై దృష్టిపెట్టడం లేదు. మరోపక్క తెలంగాణ మాత్రం వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తోంది! 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా స్పందన రావడం లేదు. ఇప్పటి వరకు చేపట్టిన మూడు విడతల్లోనూ ఆరోగ్యశాఖ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ముఖ్యంగా మూడో విడత వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం బాగా వెనకబడిపోయిం ది. తక్కవ కేంద్రాల్లోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేస్తూ తెలంగాణ దూసుకుపోతుంటే ఇక్కడ మాత్రం ఆరోగ్యశాఖ డీలాపడింది. ఎక్కువ కేంద్రాలున్నా.. తక్కువ మందికే టీకా అందించగలిగింది. మార్చి 1నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ మొదలైంది. నాలుగో తేదీ వరకు తెలంగాణలో 882 కేంద్రాల్లో 49,762 మందికి టీకా అందించారు. అంటే ఒక్కో కేంద్రంలో సగటున 56.42 మందికి వ్యాక్సిన్‌ అందింది. ఏపీలో మాత్రం మార్చి 1 నుంచి 4వరకు 2,228 కేంద్రాల ద్వారా 80,006 మందికే టీకా వేశారు. ఇక్కడ ఒక్కో కేంద్రంలో సగటున 36 మందికే టీకా అందిందన్నమాట. తెలంగాణలో వ్యాక్సిన్‌ కోసం లబ్ధిదారులు ఆస్పత్రులకు క్యూ కడుతుంటే.. ఏపీలో మాత్రం టీకా మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకపోవడం, పంపిణీపై వైద్యఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడం ఈ వైఫల్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ‘వ్యాక్సిన్‌ ప్రమాదం కాదు.


టీకా తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి’ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆరోగ్యశాఖ విఫలమైంది. ఈ విషయంలో తెలంగాణ ముందజంలో ఉంది. హైదరాబాద్‌ వాసుల దగ్గర నుంచి పల్లె జనాల వరకూ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌పై పూర్తి అవగాహన వచ్చేలా అక్కడి ఆరోగ్యశాఖ విస్తృత ప్రచారం కల్పించింది. దీంతో టీకా కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పక్కరాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు కూడా వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తోంది. ఒకరోజు ఒక ప్రైవేటు ఆస్పత్రి 100 డోస్‌లు వ్యాక్సిన్‌ వేస్తే.. అదే ఆస్పత్రిలో మరుసటి రోజు 200 డోసులకు అవకాశం కల్పిస్తోంది. తెలంగాణలో తొలిరోజు 93 కేంద్రాలు ఏర్పాటు చేసి 4,558 మందికి వ్యాక్సిన్‌ వేశారు. నాలుగో రోజు 333 కేంద్రాల్లో 21,207 మంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. ప్రతిరోజు లబ్ధిదారుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ తొలిరోజే 516 కేంద్రాలు ఏర్పాటుచేసినా 14,071 మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నాలుగోరోజు 586 కేంద్రాల్లో 26,337 మందికి టీకా ఇచ్చారు. 


వెంటాడుతున్న సాంకేతిక కష్టాలు..

ఏపీలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియే పెద్ద తలనొప్పిగా మారింది. కొవిన్‌ వెబ్‌సైట్‌ అర్ధరాత్రి, తెల్లవారుజామున తప్ప మిగిలిన సమయాల్లో సరిగా పనిచేయడం లేదు. కోవిన్‌ వెబ్‌సైట్‌లో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీమ్‌ ఇక్కడ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో మాత్రం లబ్ధిదారులు ఏ సమయంలో వెళ్లినా వెంటనే రిజిస్ట్రేషన్‌ అయిపోతోంది. ఏపీలో నాలుగైదు గంటలు ఆస్పత్రి బయట పడిగాపులు కాస్తే తప్ప రిజిస్ట్రేషన్‌ పూర్తికావడం లేదు. మరోవైపు ప్రతి కేంద్రంలో 150 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేసేందుకు ఆరోగ్యశాఖ అనుమతిచ్చింది. ఇందులో 60 శాతం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు, 40 శాతం మందికి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి టీకా వేస్తారు.


ఆరోగ్యశాఖ కూడా వచ్చిన వారికి వచ్చినట్లు టీకా వేయకుండా 60 శాతం, 40 శాతం అంటూ నిబంధనలు పెట్టి ప్రక్రియను పూర్తిగా నీరుగారుస్తోంది. కొవిన్‌ వెబ్‌సైట్‌లో సమస్యలు వస్తున్నా ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం మాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల దగ్గర సరైన ప్రమాణాళిక లేకపోవడంతో కిందస్థాయి సిబ్బంది వ్యాక్సినేషన్‌లో పూర్తిగా విఫలమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం కల్పించుకుని తగిన చర్యలు తీసుకోకపోతే వ్యాక్సినేషన్‌లో ఏపీ అట్టగుస్థాయికి చేరుతుంది.

Updated Date - 2021-03-06T09:04:36+05:30 IST