‘ఆపరేషన్‌ కమల’.. దేశానికి పట్టిన చీడ

ABN , First Publish Date - 2022-06-22T16:47:31+05:30 IST

‘ఆపరేషన్‌ కమల’ దేశానికి పట్టిన చీడ అని, ప్రజాస్వామ్యాన్ని ఇది అపహాస్యం చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విమర్శించారు.

‘ఆపరేషన్‌ కమల’.. దేశానికి పట్టిన చీడ

- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌


బెంగళూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ కమల’ దేశానికి పట్టిన చీడ అని, ప్రజాస్వామ్యాన్ని ఇది అపహాస్యం చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చివేయడమే బీజేపీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. కర్ణాటకలో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ దక్షిణాదిన ఇప్పుడు తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోందని విరుచుకుపడ్డారు. నైతిక రాజకీయాల గురించి బీజేపీ వల్లించే సిద్ధాంతాలకు ఆచరణలో జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేదన్నారు. మహారాష్ట్ర రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించి రాజకీయంగా బీజేపీ పాతాళానికి దిగజారిందన్నారు. బీజేపీకి నిజంగా నైతిక రాజకీయాలపై విశ్వాసం ఉంటే తక్షణం పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టాలకు మరింత పదును పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈడీ తదితర దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్‌ అగ్రనేతలను కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని, ఇలాంటి వాటికి భయపడే ప్రశ్నేలేదని ఆయన తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వ కూల్చివేత కుట్ర కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతోందని, ఈ పరిణామం సిగ్గుచేటని విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలతో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని, అవి శివసేన అంతర్గత కుమ్ములాటలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సీటీ రవి బెంగళూరులో మంగళవారం పేర్కొన్నారు.

Updated Date - 2022-06-22T16:47:31+05:30 IST