ఎవరిని రక్షించేందుకు.. 4 నెలలుగా బ్యాంక్‌ సీఈవో పదవికి దూరం?

ABN , First Publish Date - 2020-11-04T15:07:34+05:30 IST

కృష్ణాజిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంకులో..

ఎవరిని రక్షించేందుకు.. 4 నెలలుగా బ్యాంక్‌ సీఈవో పదవికి దూరం?

వారం క్రితమే తిరిగి బాధ్యతల స్వీకరణ

..ఆ 4 నెలల అక్రమాలనూ తనపైనే వేసుకున్న రాజయ్య

అవినీతిని కప్పిపుచ్చేందుకు తెరపైకి కులం


విజయవాడ, ఆంధ్రజ్యోతి: కృష్ణాజిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంకులో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని పక్కదారి పట్టించేందుకు ఉన్నతాధికారులు ‘కులం’ కార్డును తెరపైకి తెచ్చారు. రాజకీయ ఒత్తిళ్లతో ఏకంగా సీఈవో స్థాయి అధికారి తన హయాంలో జరగని అడ్డగోలు బదిలీల వ్యవహారాన్ని తనపైనే వేసుకున్నారు. అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తిని కావడంతో తనను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారనే విధంగా సీఈవో రాజయ్యను రంగంలోకి దింపారు.


ఏడాదిన్నరగా కేడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలను, ప్రైవేట్‌ వ్యక్తుల మితిమీరిన జోక్యాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. మరోవైపు బ్యాంకు ఉద్యోగులూ చైర్మన్‌ ఒంటెత్తు పోకడలపై ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు సీఈవోపై ఉద్యోగులు ఎలాంటి విమర్శలు చేయలేదు. అయితే, మంగళవారం బ్యాంక్‌ సీఈవో రాజయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతా తానే చేశానన్నట్టు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయన ఈ ఏడాది జూలైలో పదోన్నతిపై ఆప్కాబ్‌కు జీఎంగా వెళ్లారు. అలా వెళ్లిన వ్యక్తి వారం క్రితమే తిరిగి వచ్చి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అలాంటి వ్యక్తి మొత్తం బదిలీల తంతును తనపైనే వేసుకోవడం వెనుక పెద్దస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లే కారణంగా తెలుస్తోంది. సీఎం జగన్‌ సూచనల మేరకే పారదర్శకంగా బదిలీలు చేశామని చెబుతున్న చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు.. వాస్తవానికి సీఎంకి చెప్పింది వేరు, క్షేత్రస్థాయిలో చేసింది వేరు. మూడేళ్లపాటు పనిచేసిన వారిని బదిలీ చేస్తామని, దీనిద్వారా గత ప్రభుత్వ హయాం నుంచి ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం కలిగించినట్లు అవుతుందని చైర్మన్‌ సీఎంకు చెప్పినట్లు విలేకరులకు తెలిపారు. కానీ, క్షేత్రస్థాయిలో జరిగింది విరుద్ధం.


అడ్డగోలు తంతుకు ఇవే నిదర్శనం

గతంలో బ్యాంక్‌ సీఈవోగా పనిచేసిన సుబ్రహ్మణ్యం బదిలీల విషయంలో ఓ పాలసీ రూపొందించారు. దాని ప్రకారం ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరని సూచించారు. జిల్లా మొత్తాన్ని 3 యూనిట్లుగా విభజించారు. ఒక యూనిట్‌లో ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా వేరే యూనిట్‌కు బదిలీ చేయాలని పాలసీలో నిర్దేశించారు. తాజా బదిలీల్లో ఇవేవీ పాటించలేదు. 


విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో 10 నెలలే పనిచేసిన ఇద్దరు మహిళా ఉద్యోగులను విజయవాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరికి యూనియన్‌లో సభ్యత్వం ఉంది. మూడేళ్లు పూర్తిచేసుకున్న ఇద్దరిని ఇతర బ్రాంచీలకు పంపారు.


మచిలీపట్నం, గుడివాడ డివిజన్ల పరిధిలో చాలాకాలం పనిచేసి విజయవాడ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తిని యూనియన్‌లో కీలకంగా ఉన్నారన్న కారణంతో 10 నెలలు తిరక్కుండానే జి.కొండూరుకు బదిలీ చేశారు. 


పటమట బ్రాంచిలో మూడేళ్లు దాటిన నలుగురు ఉద్యోగులను బదిలీ చేశారు. వీరిలో తమకు అనుకూలురైన ముగ్గురిని విజయవాడలోనే పక్కపక్క బ్రాంచీలకు బదిలీ చేయగా, యూనియన్‌లో సభ్యత్వం ఉన్న మరో మహిళను గర్భిణీ అని కూడా చూడకుండా తోట్లవల్లూరుకు బదిలీ చేశారు. 


సత్యనారాయణపురం బ్రాంచికి 10నెలల క్రితమే బదిలీ అయిన వ్యక్తిని యూనియన్‌లో క్రియాశీలకంగా ఉన్నారన్న సాకుతో ఆగిరిపల్లికి పంపారు.


మంగళవారం నాటి సమావేశంలో సీఈవో బదిలీలన్నీ సక్రమంగా చేశామని చెప్పుకొచ్చారు. 83 మందికి వారు కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇచ్చామని తెలిపారు. ఈ మాట వాస్తవమే. కానీ, వారంతా చైర్మన్‌కు అనుకూలురు. 200 మందిని పైగా బదిలీ చేస్తే అదే అవకాశాన్ని మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదన్న ఉద్యోగుల ప్రశ్నకు సమాధానం లేదు. కేవలం చైర్మన్‌ను రక్షించేందుకే అన్నట్టుగా ఆయన విలేకరుల సమావేశం సాగింది. రూ.40 కోట్ల కుంభకోణంలో సూత్రధారులైన ఉద్యోగులపై చర్యలకు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారన్న దానికీ సీఈవో సమాధానం చెప్పలేదు.



Updated Date - 2020-11-04T15:07:34+05:30 IST