పండగొచ్చింది

ABN , First Publish Date - 2022-06-28T05:47:04+05:30 IST

పండగొచ్చింది

పండగొచ్చింది
సోమవారం రాత్రి అంగలూరులో సిద్ధం చేస్తున్న సభావేదిక

రేపే కృష్ణాజిల్లా మహానాడు

పసుపు తోరణాలతో గుడివాడకు పండగ కళ

బొట్టుపెట్టి ఆహ్వానం పలుకుతున్న తెలుగు మహిళలు

ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతున్న నాయకులు

సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్న సభాస్థలి

రాజప్రాసాదాన్ని తలపించేలా ముఖద్వారం

అధినేతకు స్వాగతం పలికేందుకు ఘన ఏర్పాట్లు

జిల్లాస్థాయి నేతల రాకతో ఒకటే సందడి


ఎక్కడచూసినా పసుపు తోరణాలు.. ఎక్కడికెళ్లినా కరపత్రాలతో ప్రచారాలు.. ఇంటింటా ఆడపడుచుల ఆహ్వానాలతో గుడివాడ పట్టణంలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అంగలూరులో బుధవారం జరిగే ‘కృష్ణాజిల్లా మహానాడు’కు అతిరథ మహారథులు హాజరుకానున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని, ఆత్మీయంగా సత్కరించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రెండు జిల్లాల నేతలు సమన్వయంతో సభాస్థలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.


గుడివాడ/గుడ్లవల్లేరు, జూన్‌ 27 : వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ‘కృష్ణాజిల్లా మహానాడు’ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కిందిస్థాయి కార్యకర్తల నుంచి కీలక నేతల వరకూ అందరూ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అధినేత చంద్రబాబు రాకకు ఇంకా ఒక్కరోజే సమయం ఉండటంతో అందరూ పనుల్లో నిమగ్నమయ్యారు. గుడివాడ ప్రాభవాన్ని చాటేలా అధినేతను ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకురావాలని చూస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి కృష్ణాడెల్టా సాగునీటి కష్టాలు తీర్చిన ఆయనకు మరుపురాని రీతిలో సత్కరించాలని డెల్టా రైతులు సన్నాహాలు చేస్తున్నారు. భారీ వేదికకు దీటుగా రాజప్రాసాదాన్ని తలపించేలా మహానాడు ముఖద్వారాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. కాగా, మహానాడు ప్రాంగణాన్ని సందర్శించడానికి రెండు జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు విచ్చేస్తున్నారు. అధినేతకు స్వాగతం పలుకుతూ గుడివాడ పట్టణం మొత్తాన్నీ పసుపుమయం చేశారు. ప్రధాన వీఽధులను పసుపు బ్యానర్లు, తోరణాలతో నింపేశారు. 

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం

మహానాడును భగ్నం చేయాలనే కుట్రలో భాగంగా అధికారపక్ష నాయకులు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నా టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు నాయకత్వంలోని తమ్ముళ్లు సంయమనంతో ఉంటున్నారు. తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి తదితరులు పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ వెళ్తూ, వైసీపీ ప్రభుత్వం వంచించిన తీరును వివరిస్తూ ప్రజలను మహానాడుకు సమాయత్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టిన వైనాన్ని, ఎస్సీలకు ఉపకరించే 29 పథకాలను రద్దుచేసిన అంశాలను ఎస్సీ సెల్‌ ఇన్‌చార్జి కంచర్ల సుధాకర్‌, ఆకునూరి కనకాంబరం తదితరులు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. పేరుకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేసుకోలేని విధంగా నిధులు కేటాయించి వంచించారని బీసీ సెల్‌ నాయకులు మెరగుమాల బ్రహ్మయ్య, దేవరపల్లి కోటి తదితరులు చెబుతున్నారు. టీడీపీ పాలనలో పట్టిసీమ నీటితో డెల్టాను సస్యశ్యామలం చేసిన తీరును వివరించడంతో పాటు వైసీపీ వచ్చాక ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఎగ్గొట్టిన విషయాలను తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి చల్లగుళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు సారథ్యంలో రైతుసంఘ ప్రతినిధులు వివరిస్తున్నారు. గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్‌ మండలాల్లో గ్రామస్థాయి పార్టీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ మహానాడుకు తరలిరావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.

సమన్వయంతో..

టీడీపీ వడ్లమన్నాడు కమిటీ అధ్యక్షుడు పెన్నేరు రమేశ్‌బాబు ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి మహానాడుకు ఆహ్వానిస్తున్నారు. గుడివాడ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్‌ మండల అధ్యక్షుడు వాసే మురళీ తదితరులు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వివిధ అనుబంధ సంఘాల నాయకులను సమన్వయం చేస్తున్నారు. టీడీపీ అంగలూరు గ్రామ నాయకులు లింగం చిట్టిబాబు, మేకా వెంకటేశ్వరరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  



Updated Date - 2022-06-28T05:47:04+05:30 IST