బిరబిరా..!

ABN , First Publish Date - 2022-08-09T06:26:31+05:30 IST

బిరబిరా..!

బిరబిరా..!
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి

మళ్లీ పెరుగుతున్న వరద 

ఎగువ నుంచి భారీగా వస్తున్న నీరు

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం

భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ హెచ్చరిక


విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం మొదలైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బ్యారేజీకి ఎగువ నుంచి 82,161 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 25 గేట్లను రెండడుగుల మేర, 45 గేట్లను అడుగు మేర ఎత్తి 69,090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి 41,319, పాలేరు నుంచి 5,089, కీసర నుంచి 35,753 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాల్వలకు మొత్తం 8,513 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేఈబీకి 1,104, బందరు కాల్వకు 750, ఏలూరు కాల్వకు 1,352, రైవస్‌ కాల్వకు 3,003, కృష్ణా పశ్చిమ కాల్వకు 2,304 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

వాయుగుండం హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల వ్యవధిలో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తాతీరం వెంబడి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రతీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, సోమవారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సగటు వర్షపాతం 22.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా కృత్తివెన్నులో 42.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గూడూరులో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మునేరుకు మళ్లీ వరద

వత్సవాయి : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మునేటికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి నీటిమట్టం 10.5 అడుగుల ఎత్తుకు చేరింది. మరింత వరద నీరు చేరితే లింగాల వద్ద మునేటి కాజ్‌వేను తాకవచ్చని మునేరు జేఈ నరసింహ తెలిపారు.




Updated Date - 2022-08-09T06:26:31+05:30 IST