వేధింపులకిదో ‘దారి’

ABN , First Publish Date - 2021-03-04T15:50:07+05:30 IST

టీడీపీ మాజీ కౌన్సిలర్‌కు చెందిన నివేశన స్థలంలో..

వేధింపులకిదో ‘దారి’

టీడీపీ మాజీ కౌన్సిలర్‌ స్థలంలో రోడ్డు నిర్మాణం ప్రయివేటు వ్యక్తుల పనే : కమిషనర్‌

మేమే వేయిస్తున్నాం : ఏఈ 

ఇది కక్షపూరితం : బాధితుడు   


జగ్గయ్యపేట: టీడీపీ మాజీ కౌన్సిలర్‌కు చెందిన నివేశన స్థలంలో రోడ్డు వేసేందుకు పురపాలకసంఘం ఆగమేఘాలపై అర్ధరాత్రి నుంచి పనులు చేపట్టటం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఆ వీధిలో ఇప్పటికే ఒక సిమెంట్‌రోడ్డు ఉండగా, ఆ రోడ్డు పక్కనే మరో సిమెంట్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం వైసీపీ నేత కక్షపూరిత చర్యని బాధితుడు వాపోతున్నాడు. 


పట్టణంలో పదో వార్డు చెరువుబజార్‌లో రేణుకపరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం వద్ద ఈ రోడ్డు నిర్మాణాన్ని మంగళవారం అర్ధరాత్రి పురపాలక సంఘం చేపట్టింది. అర్ధరాత్రి పూట తన స్థలంలో జేసీబీ పని చేస్తోందని తెలుసుకుని అదే ప్రాంతంలో ఉంటున్న టీడీపీ మాజీ కౌన్సిలర్‌ తాళ్లూరి సోమయ్య వెళ్లగా పురపాలక సంఘ కాంట్రాక్టర్‌ రోడ్డు వేస్తున్నామని చెప్పారు. తన స్థలంలో రోడ్డు వేయటంపై సోమయ్య జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెల్లారేవరకు ఆగాలని సూచించటంతో పనులు తాత్కాలికంగా ఆపారు.  


 రేణుకాపరమేశ్వరి దేవస్థానానికి వెళ్లేందుకు రోడ్డు కావాలని పంచాయతీ రాజ్‌శాఖ ఏడేళ్ల క్రితమే రోడ్డు వేయగా ఇప్పుడు ఆ రోడ్డును అనుకుని మళ్లీ రోడ్డు ఎందుకు వేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పటం లేదు. ఆ రోడ్డులో కనీసం పది ఇళ్లు కూడా లేకపోవు. బుధవారం ఉదయం ఆ స్థలంలో మళ్లీ మట్టి తీసేందుకు జేసీబీ, నాలుగైదు ట్రాక్టర్లు పెట్టి తీయిస్తుండటంతో మాజీ కౌన్సిలర్‌ సోమయ్య పురపాలకసంఘ కమిషనర్‌ సుభాష్‌ చంద్రబో్‌సను కలిశారు. తనకు 2010లో పురపాలకసంఘ ఇంటి నిర్మాణానికి ఇచ్చిన అనుమతి పత్రాన్ని తన తల్లి, అక్క ద్వారా తనకు వచ్చినస్థలం కాగితాలను చూపించారు. స్థలం సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ పనులు మాత్రం ఆగకపోవటంతో సోమయ్య మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో తహసీల్దార్‌గానీ, కమిషనర్‌గానీ జోక్యం చేసుకోవద్దని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను చూపించారు. ఎస్పీ పర్యటన ఉండటంతో పరిశీలిస్తామని అధికారులు చెప్పి పంపించారు. సోమయ్య మాట్లాడుతూ తన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ కబ్జా చేసేందుకు యత్నించగా కోర్టుకెళ్లి అడ్డుకున్నాననీ, న్యాయబద్ధంగా అడ్డుకోలేక ఇలా చేస్తున్నాడనీ వాపోయాడు. 

 

అది ప్రయివేటు వ్యక్తుల పనే

రోడ్డు పనులకు పురపాలక సంఘానికి సంబంధం లేదు. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మించాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులు చేసుకుంటున్న పనే.

- సుభాష్‌ చంద్రబోస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ 

బిల్లుల కోసం చేస్తున్నారు

14వ ఆర్థిక సంఘ నిధులతో రోడ్డు పనులు చేసున్నాం. గతంలో గిట్టుబాటు కావటం లేదని కాంట్రాక్టర్‌ పనులు చేయలేదు. కానీ ఇప్పుడు వేరే పనులతో పాటు పాత పనులు చేస్తేనే బిల్లులు ఇస్తామని చెప్పటంతో పనులు చేస్తున్నారు.  

- హనుమంతరావు, ఏఈ 

వేధింపులు ఆపకుంటే ఆందోళన

 చేతివృత్తి చేసుకుని జీవించే మాజీ కౌన్సిలర్‌ తాళ్లూరి సోమయ్య  స్థలం కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలి. లేకుంటే ఆందోళన చేస్తాం. అవసరం లేని చోట మళ్లీ రోడ్డు నిర్మించటం వెనుక కుట్రను బట్టబయలు చేస్తాం

- మేకా వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు 

Updated Date - 2021-03-04T15:50:07+05:30 IST