వరద.. వణుకు

ABN , First Publish Date - 2022-08-13T06:14:08+05:30 IST

బంధనాలను తెంచుకుని సాగర్‌ నుంచి సాగరం దిశగా కృష్ణమ్మ ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది.

వరద.. వణుకు
కొల్లూరు మండలంలోని పల్లపు భూముల్లోకి చేరుతున్న వరద నీరు

కృష్ణానదికి భారీగా ప్రవాహం

లంక గ్రామాలను చుట్టిన నీరు

లంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు

మరో రెండు రోజులు నిలకడగా ప్రవాహం

ఇరువైపులా కట్టలను తన్నిపెట్టిన వరద నీరు

ఇటుక బట్టీలు, వాణిజ్య పంటలను ముంచిన కృష్ణమ్మ

బ్యారేజి నుంచి 4.85 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

ప్రవాహం పెరిగితే నష్టపోతామనే ఆందోళనలో రైతులు 


తెనాలి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బంధనాలను తెంచుకుని సాగర్‌ నుంచి సాగరం దిశగా కృష్ణమ్మ ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల నుంచి పెద్దఎత్తున నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజి దగ్గర 70 గేట్లను ఎత్తివేసి 4.85 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లాలోని కొల్లిపర, బాపట్ల జిల్లాలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కొల్లిపర మండలం అన్నవరపు లంక వద్ద ప్రవాహానికి మట్టి విరిగిపడుతోంది. ప్రవాహ ఉధృతికి  కంద, పసుపు, అరటి పంటలు పాక్షికంగా దెబ్బతిని నదిలో కలసిపోతున్నాయి. కొత్తూరులంక-పెదలంక మధ్యలో చప్టాల కిందగా నీరు ప్రవహిస్తుంది. దీంతో రైతులు మొక్కజొన్న కండెలను, చేలల్లోని విద్యుత్‌ మోటార్లను ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో పల్లపు భూముల్లో ఉన్న పసుపు, అరటి, కంద పంటలు నీటమునిగాయి. కొల్లూరు మండలంలోని పెసర్లంక అరవింద వారధి దగ్గర గండి ప్రదేశంలోనూ చేలు విరిగిపడుతున్నాయి. గండిలోకి నీరు చేరటంతో కుడి కరకట్టను వరద నీరు తాకింది. కొల్లూరు దగ్గర కరకట్టకు, పెసర్లంకకు మఽధ్య ఉన్న ఇటుక గోతుల్లోని పంటలు నీట మునిగాయి. ఇటుక బట్టీలనూ వరద చుట్టముట్టింది. భట్టిప్రోలు మండలంలో పెసర్లంక-ఓలేరు, పెదపులివర్రు, కోళ్లపాలెం మధ్య చప్టాలపైకి మూడు అడుగులకుపైగా నీరు చేరటంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిఽధిలోని వల్లభాపురం-పెదకొండూరు మధ్య కరకట్ట దెబ్బతిన్నచోట ఇసుక మూటలను వేస్తున్నారు. వల్లభాపురం దగ్గర అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ గేట్లపైగా నీరు రాకుండా ఇసుక మూటలువేస్తున్నారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు 3.5 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజి నుంచి కిందికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అధికారులు అప్రమత్తం

తీరంలోని ప్రజలను అప్రమత్తం చేయాలని, నదీ తీర గ్రామాల సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టేందుకు వీలులేదని, అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధీమీనా ఆదేశించారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, నీటిపారుదల శాఖ, డ్రైనేజ్‌, పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఎప్పటికప్పుడు వరద తీవ్రతను వివరిస్తుంటారని తెలిపారు. వరద పెరిగితే జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టీడీపీ, రైతు సంఘాల నాయకులు కొల్లిపర నుంచి పడవపై నది మధ్యలో ఉన్న అనవరపులంక గ్రామాన్ని సందర్శించారు. వరద ఉదృతిని, నేల కోతపడుతున్న తీరును పరిశీలించారు. 



Updated Date - 2022-08-13T06:14:08+05:30 IST