కేయూలో రిజిస్ట్రార్‌ చర్చ

ABN , First Publish Date - 2020-12-02T06:10:18+05:30 IST

కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రారు మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ కృష్ణారెడ్డిని మాతృసంస్థకు పంపుతారనే ప్రచారం యూనివర్సిటీలో మంగళవారం విస్తృతంగా జరిగింది.

కేయూలో రిజిస్ట్రార్‌ చర్చ

నేడు యూనివర్సిటీ ఈసీ సమావేశం

కృష్ణారెడ్డిని మాతృ సంస్థకు పంపుతారని ప్రచారం

పదవిని కాపాడుకునేందుకు యత్నాలు

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :

 కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రారు మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ కృష్ణారెడ్డిని మాతృసంస్థకు పంపుతారనే ప్రచారం యూనివర్సిటీలో మంగళవారం విస్తృతంగా జరిగింది. ఈయన పదవీకాలం ఏడాది మాత్రమేనని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ గతంలో తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి తిలోదాకాలు ఇచ్చి గతేడాది అప్పటి ఇన్‌చార్జి వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ నూతన రిజిస్ట్రార్‌ మూడేళ్లు అంతకు మించి పనిచేయవచ్చని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశం వెలుగులోకి రావడంతో ఈసీ నిర్ణయాన్ని కాదని రిజిస్ట్రార్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై   యూనివర్సిటీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు, మచిలీపట్నానికి చెందిన మరికొందరు.. ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి, విద్యాశాఖ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులు ఇటీవల యూనివర్సిటీకి వచ్చి విచారణ చేశారు. గతంలో పని చేసిన ఇన్‌చార్జి వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్లను కూడా విజయవాడకు పిలిపించి ఏసీబీ అధికారులు వివరాలు రాబట్టారు. ప్రస్తుత రిజిస్ట్రార్‌ యూనివర్సిటీ అతిథి గృహంలో ఉంటూ హెచ్‌ఆర్‌ఏ తీసుకోవడం వివాదాస్పదమైంది. అథిది గృహం అద్దెసొమ్మును రిజిస్ర్టార్‌ ఇటీవల చెల్లించారు. ఏసీబీ అధికారులు యూనివ వర్సిటికీ వచ్చి విచారణ చేసిన నాటి నుంచి రిజిస్ట్రార్‌ ఇక్కడి నుంచి తన మాతృ సంస్థ అయిన నన్నయ యూనివర్సిటీకి వెళ్లిపోతారనే ప్రచారం ఊపందుకుంది. 

 పదవి దక్కించుకునేందుకు..

 రిజిస్ట్రార్‌ పదవి ఖాళీ అవుతుందనే ప్రచారంతో నూజివీడు పీజీ సెంటరు ప్రత్యేక అధికారిగా ఉన్న హైమావతి ఈ పదవిని దక్కించుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా తన వంతుగా ప్రయత్నాలు చేసుకున్నారనే ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది. ఆమె ప్రొహిబిషన్‌ పిరీయడ్‌ డిసెంబరుతో పూర్తి కానుందని ప్రొఫెసర్లు చెబుతున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు హైమావతిని రిజిస్ట్రార్‌గా నియమించాలని సిఫార్సు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెను నూజివీడు పీజీ సెంటరు ప్రత్యేక అధికారిగా నియమించడం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే అంశంపై ఒకరిద్దరు ప్రొఫెసర్లు కోర్టులో కేసు వేశారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఆమెను  రిజిస్ట్రార్‌గా ఎలా నియమిస్తారనే అంశంపైనా అనేక అనుమానాలు నెలకొన్నాయి. 

నేడు ఈసీ సమావేశం 

కృష్ణా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) సమావేశం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిలోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో జరగ నుంది. ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ మార్పు అంశంపై చర్చ జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయనే వాదన వినపడు తోంది. సమావేశంలో ఏ నిర్ణ యం తీసుకుంటారనే చర్చ హాట్‌టాపిక్‌ అయింది. 

Updated Date - 2020-12-02T06:10:18+05:30 IST