వరద నీరు.. వృథా

ABN , First Publish Date - 2022-08-17T05:53:39+05:30 IST

కృష్ణానదికి వస్తున్న వరదనీటిని పులిచింతల డ్యాం దాటిన తర్వాత నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో వృధాగా సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.

వరద నీరు.. వృథా
ప్రకాశం బ్యారేజి దిగువకు విడుదల అవుతున్న వరదనీరు

90 టీఎంసీల పైగా నీరు సముద్రంలోకి

2021 జూన్‌ నుంచి 515 టీఎంసీలు..

గుంటూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి వస్తున్న వరదనీటిని పులిచింతల డ్యాం దాటిన తర్వాత నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో వృధాగా సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. నిత్యం ఏడెనిమిది టీఎంసీల వరకు నీరు సముద్రంలోకి వదలాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్‌ నెల నుంచి తీసుకొంటే ఇప్పటివరకు 90 టీఎంసీలకు పైగా నీరు సరప్లస్‌ వచ్చిందని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా వరద కొనసాగుతోండటంతో సముద్రంలోకి వెళ్లే టీఎంసీల సంఖ్య మరింత పెరగనుంది. కాగా ప్రకాశం బ్యారేజ్‌ దిగువున రెండు ఆనకట్టలు నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేసిన నిర్ణయాలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో బ్యారేజ్‌కు సరప్లస్‌గా వస్తున్న నీటిని సముద్రంలోకి విడిచి పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. కృష్ణా డెల్టా సిస్టమ్‌కు సంబంధించి ప్రకాశం బ్యారేజ్‌లో గరిష్టంగా 3.07 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలరు. అంతకుమించి వచ్చే వరదనీటిని దిగువకు వదలాల్సిందే. ఇప్పటివరకు 120 టీఎంసీల వరకు నీరు బ్యారేజ్‌కు రాగా తూర్పు, పశ్చిమ డెల్టాలు, గుంటూరు ఛానల్‌కు కలిపి 32.03 టీఎంసీల వరకు వినియోగించారు. మిగతా 90 టీఎంసీల నీరు వృధాగా సాగరంలోకి వెళ్లిపోయింది. నేటికీ 2.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ఆ నీరు అంతా దిగువకు వదిలేస్తున్నారు. నిత్యం సగటున 8 నుంచి 10 టీఎంసీల వరకు నీరు సముద్రం బాట పడుతోంది. 

మూడింతల నీరు సముద్రంలోకి..

గత ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు కృష్ణా డెల్టా అవసరాలకు వినియోగించిన నీరు కంటే దాదాపుగా మూడింతల వరదనీరు సముద్రంలోకి వెళ్లింది. 2021 జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ సంవత్సరం మే నెలాఖరుకే 501.36 టీఎంసీలు సరప్లస్‌గా సముద్రంలోకి చేరాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి మరో 90 టీఎంసీలకు పైగా నీరు సర్‌ప్లస్‌ అయింది. సాదారణంగా ఒక ఏడాదికి కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలతో పాటు గుంటూరు ఛానల్‌లో ఆయకట్టు, తాగునీరు అవసరాలకు 170 టీఎంసీల నుంచి వాతావరణాన్ని బట్టి 190 టీఎంసీల వరకు నీటిని వినియోగిస్తారు. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకొంటే సముద్రంలోకి వెళ్లిపోతున్న నీరే మూడు రెట్లు అధికంగా ఉంది. 

గోదావరి - పెన్నా నదుల అనుసంధానం జరిగితేనే..

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఐదు దశల్లో గోదావరి - పెన్నా నదుల అనుసంధానం చేయాలని బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా గోదావరి నదికి ముందుగా వరదలు వస్తాయి. ఆ తర్వాత కృష్ణా, అక్టోబరు, నవంబరు నెలల్లో పెన్నాకు వరద వస్తుంది. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం చేయడం ద్వారా వృధా నీటిని వేరే ఆయకట్టులకు తరలించి కొంతమేరకు వినియోగించొచ్చు. ప్రస్తుతం పెన్నా పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత లేదు. అదే నదుల అనుసంధానం జరిగి ఉంటే కృష్ణానదిలో సరప్లస్‌ వాటర్‌ని అక్కడికి తరలించి ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చు. కాగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక నదుల అనుసంధానం ప్రాజెక్టుని రద్దు చేసింది. కేవలం పల్నాడు వరకే కరువు దుర్భిక్ష నివారణ పథకాన్ని నిర్మిస్తామని చెప్పిందే తప్పా ఇంతవరకు ఒక్క పనిని చేపట్టడం లేదు. 


బ్యారేజి దిగువకు 2,71,500 క్యూసెక్కులు  

తాడేపల్లి టౌన్‌: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి మంగళవారం సాయంత్రానికి 2,87,000 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 15,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 10 గేట్లను 7అడుగుల మేర 60 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 2,71,500 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. 


సాగర్‌ నీటిమట్టం 586.20 అడుగులు

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి ఆరో రోజు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్‌ 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగించారు. జూరాల, రోజాల నుంచి శ్రీశైలానికి 3,35,635 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  శ్రీశైలం నుంచి సాగర్‌కు 3,83,697 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ నుంచి అదే మోతాదులో నీటిన దిగువకు విడుదల చేస్తున్నారు.  సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 586.20 అడుగులు ఉంది. ఇది 301.35 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8,541, కుడి కాలువ ద్వారా 8,642, వరద కాలువ ద్వారా 300, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33,008, 26 క్రస్ట్‌గేట్లలో 6 గేట్లను 5 అడుగుల మేర, 20 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,31,406, మొత్తం ఔట్‌ఫ్లో 3,83,697 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి  ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,83,697 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులుంది. ఇది 210.99 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 2,51,716 క్యూసెక్కులు, రోజా నుంచి 77,919, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 3,35,635 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 


Updated Date - 2022-08-17T05:53:39+05:30 IST