ఆయకట్టుకు కృష్ణా జలాలు

ABN , First Publish Date - 2020-08-08T10:07:50+05:30 IST

కృష్ణమ్మ ఎగువ పరివాహక ప్రాంతం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటం, కర్ణాటకలోని

ఆయకట్టుకు కృష్ణా జలాలు

 ఎగువన భారీ వర్షాలతో సాగర్‌కు వరద రాక

 వానాకాలానికి పూర్తిస్థాయిలో నీటి విడుదలకు అవకాశం

 25 రోజులు నిరాటంకంగా సాగునీరు

 సెప్టెంబరు నుంచి నవంబరు వరకు వారబంధీ


నల్లగొండ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కృష్ణమ్మ ఎగువ పరివాహక ప్రాంతం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు నిండుకుండలా మారడంతో నాగార్జునసాగర్‌ కు వరద వస్తోంది. వారం పాటు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎడమ కాల్వకు శుక్రవారం సాయంత్రం హుటాహుటిన సాగునీటిని విడుదల చేశారు. కృష్ణానదీ జన్మస్థానం మహాబలేశ్వరంలో ఈ నెల 5నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 మధ్య పశ్చిమకనుమల్లో 130 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో ఆలమట్టికి భారీ వరద వస్తోంది. ఆగస్టు 15లోగా శ్రీశై లం, నాగార్జునసాగర్‌ జలాశయాలు పూర్తిగా నిండుతాయని, తుంగభద్ర కూడా వరదతో పోటెత్తుతుందని రెండు రోజుల క్రితం సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యుసీ) తెలిపింది.


దీంతో ఎడమ కాల్వ ద్వారా పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయమే సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి జగదీ్‌షరెడ్డి నీటి విడుదల చేయాలని నిర్ణయించగా, వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన బెంగళూరు వెళ్లారు. దీంతో సమయానికి రాలేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా, ఇప్పటికే 557అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అనుకున్న సమయానికి ముందే వరద వస్తుండటంతో ఈనెల 7 నుంచి 25 వరకు నిరాటంకంగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు నుంచి నవంబరు వరకు వారబంధీవిధానంలో నీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎడమకాల్వ పరిధిలో నీటి విడుదల షెడ్యూల్‌ సోమవారం విడుదలకానుంది. ఎగువన వరద ప్రవాహం నిరాటంకంగా ఉంటే వారబంధీ విధానాన్ని ఎత్తివేసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.


3.50లక్షల ఎకరాలకు జీవం

ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట పరిధిలో ఎడమ కాల్వ కింద 3.50లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందనున్నాయి. సాగునీటిపై ఆశతో జూన్‌ మాసం చివర్లోనే 20శాతం మంది రైతులు నార్లు పోసుకొని ఎదురుచూస్తున్నారు. నారు ముదురుతోందని అందోళన చెందుతున్న నేపథ్యంలో అనూహ్యంగా శుక్రవారం నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతాంగం ఆనందంలో ఉంది. నిరాటంకంగా నీరు వస్తుండటంతో దమ్ములు చేసుకొని, నార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరో 20 రోజుల్లో ఆయకట్టు పరిధిలో నాట్లు ముమ్మరం కానున్నాయి. ఇప్పటికే బోర్లు, బావులు, చెరువులు కింద 30 నుంచి 40శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. తాజాగా సాగర్‌ నీటి విడుదలతో ఈ నెలాఖరులోగా నాట్లు పూర్తికానున్నాయి. ప్రస్తుతం ఎరువుల కొరత కూడా లేదని, రైతులకు వాటిని అందుబాటులో ఉంచుతామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-08T10:07:50+05:30 IST