కృష్ణాష్టమి వేడుకలు ఆరంభం

ABN , First Publish Date - 2022-08-19T06:07:25+05:30 IST

అల్లరి చేసే చిన్ని కృష్ణుడు.. ఆట పట్టించే గోపికలు.. ఆరాధించే రాధ.. ఆత్మీయ గోవులు..! అనంతపురం శివారులోని ఇస్కాన మందిరానికి రేపల్లె, బృందావనం తరలివచ్చిందా అనిపించేలా.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ప్రారంభించారు.

కృష్ణాష్టమి వేడుకలు ఆరంభం
ఇస్కాన ఆలయంలో ప్రత్యేక అలంకరణలో రాధాకృష్ణులు

అనంత బృందావనం


అల్లరి చేసే చిన్ని కృష్ణుడు.. ఆట పట్టించే గోపికలు.. ఆరాధించే రాధ.. ఆత్మీయ గోవులు..! అనంతపురం శివారులోని ఇస్కాన  మందిరానికి రేపల్లె, బృందావనం తరలివచ్చిందా అనిపించేలా.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ప్రారంభించారు. మందిరాన్ని విశేషంగా అలంకరించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం దర్శన హారతి, లోకశాంతి కోసం గీతాయజ్ఞం, సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో రాధాకృష్ణుల వేషధారణల్లో చిన్నారులు అలరించారు. రాత్రికి రాధాపార్థసారఽథులకు హనుమద్‌ వాహనసేవ, ఊంజలసేవ నిర్వహించారు. సాయి ట్రస్టు, శ్రీ నృత్యకళానిలయం ఆధ్వర్యంలో ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన సాయిగోకులం కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. గోపూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలు గోపికల వేషధారణతో కోలాటం ఆడారు. రాధాకృష్ణుల వేషాల్లో చిన్నారులకు శ్రీకృష్ణ తులాభారం, ఉట్లోత్సవం నిర్వహించారు. ఏపీ నాటక అకాడమీ చైర్‌పర్సన హరిత, చిన్మయా మిషన ప్రతినిధి స్వామి ఆత్మవిదానం సరస్వతి, ప్రజాపిత బ్రహ్మకుమారి శారద చిన్నారులకు జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాయిట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్‌, నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి, శ్రీనిధి రఘు తదితరులు పాల్గొన్నారు.   

 - అనంతపురం కల్చరల్‌ 




Updated Date - 2022-08-19T06:07:25+05:30 IST