గుప్తనిధులంటూ క్షుద్ర పూజలు

ABN , First Publish Date - 2020-11-30T04:54:24+05:30 IST

Kshudra pujas like all secret funds

గుప్తనిధులంటూ   క్షుద్ర పూజలు
తవ్వకాల స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ సీహెచ్‌శ్రీధర్‌, ఎస్‌ఐ యు.మహేష్‌

గుట్టుగా తవ్వకాలు

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

నిందితులపై కేసు నమోదు

బసవపాలెంలో ఘటన


 గుప్త నిధుల కోసం అర్ధరాత్రి వేళ కారులో నుంచి దిగిన కొందరు వ్యక్తులు.. జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లారు.. శిథిలమై ఉన్న నాలుగు గోడల మధ్యకు చేరుకున్నాక కొలతలు తీసి..పూజా సామగ్రి సిద్ధం చేశారు. అంతలో కారులో నుంచి గంభీరంగా ఉన్న ఓ వ్యక్తి దిగి అక్కడ పూజలు ఆరంభించాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న స్థానికులు కొందరు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలసి అక్కడకు చేరుకుని క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఈ ఘటన భోగాపురం మండలం తూడెం పంచాయతీ బసవపాలెం గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


భోగాపురం, నవంబరు 29:

బసవపాలెం గ్రామానికి సమీపంలో కొండ ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని ఎవరో చెప్పడంతో అక్కడ క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు ఆరంభించాలని కొందరు వ్యక్తులు ప్రణాళిక వేసుకున్నారు. శనివారం రాత్రి  సుమారు 11 గంటల ప్రాంతంలో ఓ కారులో చేరుకున్నారు. అందులో నుంచి దిగిన ఆయా వ్యక్తులు ప్రధాన రోడ్డు నుంచి కిలోమీటరు దూరం వరకు జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లారు. సర్వే నెంబరు 25లో ఉన్న శిథిలమైన గోడల మధ్యకు చేరుకున్నాక అక్కడ కొలతలు తీసి పూజలు ఆరంభించారు. సెంటు జల్లి, నాలుగు పళ్లాల్లో ప్రమిదలు, పూజా సామగ్రి ఉంచి పూజలు చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. ఇదంతా గుట్టుగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి అందరినీ అదుపులోకి తీసుకొన్నారు. సీఐ సీ.హెచ్‌శ్రీధర్‌, ఎస్‌ఐ యు.మహేష్‌ ఆదివారం ఉదయం మరోసారి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తవ్వకందారుల నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌ను విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. క్షుద్రపూజలు చేయడం, తాయిత్తులు కట్టడం చేస్తుంటానని, విశాఖ జిల్లా గాజువాక హైస్కూల్‌ రోడ్డుకు చెందిన రవిశేఖర్‌, విజయనగరం జిల్లా గరివిడికి చెందిన నరసింహరాజు కుటుంబ సభ్యులకు భూత వైద్యం చేయడంతో వారితో పరిచయం ఏర్పడిందని నిజాముద్దీన్‌ తెలిపాడు. బసవపాలెం కొండ ప్రాంతంలో పూర్వం రాజులు నివాసముండేవారని తెలుసుకొన్నామని, ఈ ప్రాంతంలో అంజనం వేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయాలని వచ్చామని చెప్పాడు. తనతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురు ఉన్నట్లు వివరించాడు. పోలీసులు గుప్త నిధుల తవ్వకంపై మైన్స్‌, రెవెన్యూ, భూగర్భ గనులశాఖలకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు. 


Updated Date - 2020-11-30T04:54:24+05:30 IST