ఘనంగా కేటీఆర్‌ జన్మదినం

ABN , First Publish Date - 2021-07-25T08:14:49+05:30 IST

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు

ఘనంగా కేటీఆర్‌ జన్మదినం

  • ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన
  • మంత్రులు, నేతలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
  • అసెంబ్లీ ఆవరణలో మొక్క నాటిన స్పీకర్‌
  • తెలంగాణ భవన్‌లో జన్మదిన వేడుకలు 
  • జూబ్లీహిల్స్‌లో మెగా రక్తదాన శిబిరం
  • సూర్యాపేటలో దివ్యాంగులకు వాహనాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు కేక్‌ కోసి వేడుకలు జరుపుకొన్నారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, దివ్యాంగులకు వాహనాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల నుంచి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో తాను బయటికి రానని కేటీఆర్‌ ప్రకటించడంతో వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్మాన్‌, యూకే తెలుగు రాష్ట్రాల డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, ఆరేస్టలియా హైకమిషనర్‌ ఆఫ్‌ ఇండియా.. బారి ఒఫారెల్‌ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. క్రీడాకారులు వీవీఎస్‌ లక్ష్మణ్‌, గుత్తా జ్వాల, ప్రజ్ఞాన్‌ ఓజా, హనుమా విహారి, సినీ నటులు చిరంజీవి, మహే్‌షబాబు, సోనూసూద్‌, సుధీర్‌ బాబు, అడివి శేష్‌, మంచు విష్ణు, సంగీత దర్శకుడు తమన్‌, దర్శకులు విష్ణు వర్థన్‌ ఇందూరి, ఎన్‌.శంకర్‌, గోపీచంద్‌ మలినేని, సంపత్‌ నంది, కోన వెంకట్‌, హేమంత్‌ మధుకర్‌, గోపీ మోహన్‌, బాబి తదితరులు ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎంపీలు సంతో్‌షకుమార్‌, మాలోతు కవిత, బీబీ పాటిల్‌, రంజిత్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ కృష్ణ, ఎంపీలు వైఎస్‌ చౌదరి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివా్‌సరావు, బీజేపీ నేత మురళీధర్‌రావు, కాంగ్రెస్‌ నేత మధుయాష్కీగౌడ్‌, సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ తదితరులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


వరంగల్‌లో రక్తదాన శిబిరం.. 

చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో హన్మకొండలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆవరణలో మొక్కలు నాటారు. వరంగల్‌ చౌరస్తాలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ట్రై మోపెడ్‌లను సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు అందజేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ సొంతంగా కొన్న 20 ట్రైమోపెడ్‌లను అర్వపల్లి మండలం రామన్నగూడెంలో దివ్యాంగులకు మంత్రి అందజేశారు. దురాజ్‌పల్లిలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ ఈ శిబిరాన్ని పరిశీలించారు. కాగా, శనివారం ఒక్కరోజే ఈ శిబిరంలో 24,255 మంది రక్తదానం చేశారు. కరోనా సమయంలో ఒకేరోజు ఇంతమంది రక్తదానం చేయడం ద్వారా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. ఇక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో మొక్కలు నాటారు.



థ్యాంక్యూ పప్పూ..

మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా మరిన్ని విజయాలు అందుకోవాలి’’ అని కవిత ట్వీట్‌ చేశారు. ఇందుకు కేటీఆర్‌ స్పందిస్తూ, ‘‘థ్యాంక్యూ పప్పూ!’’ అని రీట్వీట్‌ చేశారు. 



కేటీఆర్‌కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు  

హైదరాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌కు వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆ  భగవంతుడు ఆయురారోగ్యాలతోపాటు నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను, 54లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ఇచ్చే మనసును కూడా ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా, వచ్చే మంగళవారం షర్మిల మునుగోడులో నిరుద్యోగ దీక్ష చేస్తారు.


మూడు కోట్ల మొక్కలు నాటిన నేతలు.. 


మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు మొక్కలు నాటారు. స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి శాసనసభ ఆవరణలో, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో మొక్కలు నాటగా, మంత్రి హరీశ్‌రావు కొండాపూర్‌లోని పాలపిట్ట పార్కులో, రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్‌.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి రామగుండంలో మొక్కలు నాటారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో వృక్షార్చనలో పాల్గొన్నారు. మంత్రి అజయ్‌కుమార్‌ ఖమ్మంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో, శ్రీనివా్‌సగౌడ్‌ పాలమూరులోని వీరన్నపేట ప్రకృతివనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో తలసాని సాయికిరణ్‌ ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌చేసి, కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక గీతాల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత పాల్గొన్నారు. ఖిలా వరంగల్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు.



Updated Date - 2021-07-25T08:14:49+05:30 IST