ఆస్తుల నమోదు కోసం దళారులకు ఒక్క పైసా ఇవ్వొద్దు: కేటీఆర్

ABN , First Publish Date - 2020-09-26T17:24:57+05:30 IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆస్తుల నమోదు కోసం దళారులకు ఒక్క పైసా ఇవ్వొద్దు: కేటీఆర్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ నగరం ఆరు సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు.


ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తోందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తోందన్నారు. 

 

ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని కేటీఆర్ తెలిపారు. కేవలం ప్రజలకు వారి ఆస్తుల పైన హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తోందన్నారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్క పైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.


Updated Date - 2020-09-26T17:24:57+05:30 IST