GHMC లో మళ్లీ అదే తీరు.. మారరు వీరు.. KTR ఆదేశాలు పట్టించుకోరేం..!?

ABN , First Publish Date - 2022-02-17T15:27:10+05:30 IST

జీహెచ్‌ఎంసీ అదే నిర్లక్ష్యం చూపుతోంది. ప్రాథమిక స్థాయిలో..

GHMC లో మళ్లీ అదే తీరు.. మారరు వీరు.. KTR ఆదేశాలు పట్టించుకోరేం..!?

  • ఎస్‌టీసీల ఏర్పాటులో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం
  • 16 నెలల్లో 24 మాత్రమే అందుబాటులోకి 
  • సర్కిల్‌కు మూడు చొప్పున 90 ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • కేటీఆర్‌ ఆదేశాలనూ విస్మరించిన అధికారులు

హైదరాబాద్‌ సిటీ : సమగ్ర ఘన వ్యర్థాల మెరుగైన నిర్వహణలో జీహెచ్‌ఎంసీ అదే నిర్లక్ష్యం చూపుతోంది. ప్రాథమిక స్థాయిలో వ్యర్థాల డంపింగ్‌, తరలింపునకు ప్రతిపాదించిన సెకండరీ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల (ఎస్‌టీసీ) ఏర్పాట్లు నత్త నవ్విపోయేలా సాగుతున్నాయి. 16 నెలలైనా 30 శాతం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు కూడా అందుబాటులోకి రాలేదు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ లోపం, సంబంధిత విభాగం అధికారుల ఉదాసీనతే ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రవాణా కేంద్రాలకు (ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు) ..  అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. వ్యర్థాలు ఎప్పటికప్పుడు తరలించక పోవడంతో దుర్వాసన వస్తోందని కొన్ని చోట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


అందుకే జాప్యమట..

యాంత్రిక విధానంలో పని చేసేలా ఓ ప్రైవేట్‌ సంస్థ ద్వారా ఎస్‌టీసీలను జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం షెడ్డు, యంత్రాలు ఏర్పాటు చేశారు. స్థల కొరత, స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ఇతర చోట్ల ఎస్‌టీసీల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. స్థలాల గుర్తింపు, కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత విభాగం అంతగా శ్రద్ధ పెట్టలేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వ్యర్థాల నిర్వహణపై ఇటీవలి కాలంలో కేటీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో అధికారులు ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేనట్లుగా కనిపిస్తోంది. ఎస్‌టీసీలు అందుబాటులోకి రాని దృష్ట్యా.. ఆర్‌సీవీలో స్వచ్ఛ ట్రాలీల నుంచి చెత్తను వేసి తరలిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 72 ఆర్‌సీవీలు ఉన్నాయి. ఇందులో 49 జీహెచ్‌ఎంసీవి కాగా, 23 ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందినవి. 


ఈ నేపథ్యంలో ఎస్‌టీసీలు ఏర్పాటు చేయాలని మంత్రి కె. తారక రామారావు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. నవంబర్‌ 2020లో హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన ఎస్‌టీసీని ఆయన ప్రారంభించారు. సర్కిల్‌కు మూడు చొప్పున 90 ఎస్‌టీసీలు నిర్మించాలని ఆదేశించారు. ఈ 16 నెలల్లో ఇప్పటి వరకు కేవలం 27 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్‌ సంస్థకు అప్పగించిన ఈ బాధ్యతలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మంత్రి ఆదేశించిన పనుల్లోనూ ఆశించిన స్థాయి పురోగతి కనిపించడం లేదు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఇమ్లిబన్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నుంచి చెత్త రవాణా కేంద్రాలున్నాయి. వీటికి అదనంగా అధునాతన పద్ధతిలో ఎస్‌టీసీలు ఏర్పాటు చేయాలని భావించారు.

Updated Date - 2022-02-17T15:27:10+05:30 IST