కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

ABN , First Publish Date - 2021-03-04T23:11:25+05:30 IST

కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై  తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఖాజీపేట రైల్వే‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సమాధానంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారని.. అయినా కూడా కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం150 ఎకరాల విలువైన భూమిని రాష్ట్రం ప్రభుత్వం సేకరించి కేంద్రానికి అప్పగించిదన్నారు.  ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఐఆర్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తాజాగా ఖాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని స్పష్టం చేయడం వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసినట్లు అవుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్లలో రాష్ట్రంలోని పెండింగ్ రైల్వేలైన్‌లకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్న హైస్పీడ్ ట్రైన్, బుల్లెట్ రైలు విషయంలోనూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయే చూపించిందన్నారు. రైల్వేలను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిసారి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు. తాజాగా రాష్ట్ర పునర్ విభజన చట్టంలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి మరోసారి తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరీని బీజేపీ చాటుకుందన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని.. రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి లేదని తెలిపారు. రైల్వేలను ప్రైవేటీకరించడం జాతి వ్యతిరేక చర్య అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు.


 త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన  కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైల్వేల ప్రైవేటీకరణ చేయడంతో దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రైల్వే నుంచి నూతన ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని దుయ్యబట్టారు. కేంద్రం వైఖరీతో దేశంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం గగ్గోలు పెడుతున్న బీజేపీ నాయకులు ఈ విషయంలో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-04T23:11:25+05:30 IST