ఏపీ పరిస్థితులపై Minister KTR నిన్న అలా.. ఇవాళ ఇలా.. ఎందుకిలా..!

ABN , First Publish Date - 2022-04-30T15:56:05+05:30 IST

తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై తిరిగి స్పందించారు.

ఏపీ పరిస్థితులపై Minister KTR నిన్న అలా.. ఇవాళ ఇలా.. ఎందుకిలా..!

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై తిరిగి స్పందించారు. తాను నిన్న క్రెడాయ్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవని.. అవి ఆంధ్రప్రదేశ్‌లోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ట్వీట్‌ చేశారు. ‘‘ఈరోజు ఒక మీటింగ్‌లో అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు.. ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు. నేను ఏపీ సీఎం జగన్ గారిని సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


అసలేం జరిగిందంటే...

నిన్న క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘నా ఫ్రెండ్‌ ఒకాయన ఉన్నారు. సంక్రాంతికి ఆయన పక్క రాష్ట్రానికి పోయారు. ఆయనకు అక్కడ తోటలున్నాయి. ఇల్లుంది. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్‌ చేశారు. కేటీఆర్‌ గారూ.. మీరొక్క పని చేయండి. మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రానికి పంపండి అని అన్నారు. ఎందుకండి అని నేనన్నాను. ఏమీ లేదు సార్‌.. సంక్రాంతికి వెళ్లి మా ఊళ్లో నాలుగు రోజులున్నాను. ఊళ్లో కరెంటు లేదు. నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమైపోయాయి. అన్యాయంగా.. అధ్వానంగా ఉంది. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాతే నాకు ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని అన్నారు. మనోళ్లందరినీ అక్కడకు పంపితే.. మన విలువేమిటో... ప్రభుత్వం చేస్తున్నదేమిటో అప్పుడు తెలుస్తుందని చెప్పారు’’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తాను చెబుతున్నది అతిశయోక్తి అని అనిపిస్తే.. తాను డబ్బా కొట్టుకుంటున్నానని భావిస్తే.. కారేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లి రావాలని సూచించారు.


సోషల్ మీడియా వేదికగా..!

కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా వార్ ప్రకటించింది. పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు స్పందించింది. అందునా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలున్నాయి. ఎలక్షన్స్ వచ్చాయంటే.. ఒకరికొకరు పెద్ద ఎత్తున సహాయ సహకారాలందించుకుంటారు. అలాంటప్పుడు కేటీఆరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వైసీపీకి మింగుడు పడుతుందా? కక్కలేక.. మింగలేక ఉండిపోయారు. అప్పటికీ ఓ ప్రముఖ నేత సమర్ధించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యాఖ్యలు పసలేనివిగానే అనిపించాయి. ఇక ఇదిలా ఉండగా.. అసలే ఎన్నికల తరుణం సమీపిస్తోంది. భాయీ.. భాయీ అనుకోవాల్సిన సమయంలో ఈ వైరమెందుకని భావించారో ఏమో కానీ కేటీఆర్ రాత్రికి రాత్రే మనసు మార్చుకున్నారు. తనేదో ఆ వ్యాఖ్యలను అన్యాపదేశంగా చేశానని.. వాటి వెనుక దురుద్దేశమేమీ లేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. కొన్ని గంటల్లోనే జగన్‌కు జై కొట్టారు. కానీ చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం. చేసిన వ్యాఖ్యలేమో క్రెడాయ్ సమావేశంలో.. ఇలాంటి చోట అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏపీకి వచ్చే పెట్టుబడులు సైతం వెనుతిరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.



Updated Date - 2022-04-30T15:56:05+05:30 IST