KTR సార్.. ఖతర్‌ నుంచి Hyderabad వచ్చాం.. దోమలతో చస్తున్నాం..!

ABN , First Publish Date - 2022-05-03T14:58:37+05:30 IST

‘కేటీఆర్‌ సార్‌.. ఇటీవలే ఖతర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాం. మేం ఉంటోన్న ..

KTR సార్.. ఖతర్‌ నుంచి Hyderabad వచ్చాం.. దోమలతో చస్తున్నాం..!

  • మంత్రికి అంబర్‌పేట వాసి ఫిర్యాదు
  • కాలుమీద వాలిన దోమ 
  • ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్‌
  • ఇమ్రాన్‌ ఫిర్యాదుతో స్పందించిన ఎంటమాలజీ విభాగం

హైదరాబాద్‌ సిటీ : ‘కేటీఆర్‌ సార్‌.. ఇటీవలే ఖతర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాం. మేం ఉంటోన్న అంబర్‌పేట ఖాద్రీబాగ్‌లో దోమలు చంపేస్తున్నాయి. మా పిల్లల శరీరమంతా దోమకాట్లే. నివారణ మందు చల్లించాలని విజ్ఞప్తి’.


- కాలుపై దోమ వాలిన ఫొటోనూ ఖాద్రీబాగ్‌కు చెందిన ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వీటిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సీఎం ఓ తెలంగాణ, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌నూ ట్యాగ్‌ చేశారు.

- అంబర్‌పేటలో మాత్రమే కాదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే దుస్థితి. వేసవిలోనూ దోమలు విజృంభిస్తున్నాయి. నీటి నిల్వల్లో వృద్ధి చెందే దోమలు ఇప్పుడెలా పెరుగుతున్నాయంటే ఎప్పటిలానే ప్రజల అవగాహన లోపమే కారణమని అధికారులు సమాధానమిస్తున్నారు. ఖతర్‌ నుంచి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ ఉండే ఖాద్రీబాగ్‌ పరిసర ప్రాం తాల్లో నాలాలు, చెరువులు లేవు. అయినా అక్కడి ప్రజలు దోమలతో అల్లాడుతున్నారు.


ఈ ప్రాంతాల్లో అధికం..

సతన్‌నగర్‌లోని బీకే గూడ, సాయిబాబానగర్‌, జయప్రకాష్‌నగర్‌, శ్రీరాంనగర్‌, రామంతాపూర్‌లోని శ్రీనివాసపురం, వెంకట్‌రెడ్డినగర్‌, ఉప్పల్‌లోని విజయపురి కాలనీ, లంగర్‌హౌ‌స్‌లోని వినాయక్‌నగర్‌, బాపూనగర్‌, సన్‌ సిటీ, గొల్లబస్తీ, బోరబండ, అల్లాపూర్‌, కవాడిగూడ, దిల్‌సుఖ్‌నగర్‌లోని ద్వారకాపురి కాలనీ, విద్యుత్‌నగర్‌, వికాస్‌ నగర్‌, న్యూ మునిసిపల్‌ కాల నీ, భవానీనగర్‌ తదితర ప్రాంతాల్లో దోమల తీవ్రత ఎక్కువగా ఉంది. మూసీకి ఇరువైపు లా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానం.


ఏటా రూ.8 కోట్లు..

ఎంటమాలజీ విభాగంలో 2,500 మంది కార్మికులు పని చేస్తున్నారు. సిబ్బంది వేతనాలు, రసాయనాలు, ఫాగింగ్‌లో వినియోగించే పెట్రోల్‌ కోసం యేటా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా దోమల తీవ్రత తగ్గడం లేదు. కేటాయించిన ప్రాంతాల్లో ప్రతి వారం రసాయనాలు పిచికారి చేయాలి. ఇళ్లలో పరిశీలించి నీటి నిల్వలు లేకుండా ప్రజలను చైతన్యపర్చాలి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఫాగింగ్‌, రసాయనాలు పిచికారి చేసిన ఎంటమాలజీ విభాగం కొన్నాళ్లుగా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇదే మండే ఎండల్లోనూ దోమల వృద్ధికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. ఇమ్రాన్‌ ఫిర్యాదుపై కేటీఆర్‌ స్పందించలేదు.


స్పందించిన జీహెచ్‌ఎంసీ..

ఇమ్రాన్‌ ఫిర్యాదుపై జీహెచ్‌ఎంసీ స్పం దించింది. ఎంటమాలజీ విభాగం సిబ్బంది సోమవారం ఖాద్రీబాగ్‌కు వెళ్లి  ఆయన నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో దోమల మందు పిచికారి చేశారు. రాత్రి వేళ ఫాగింగ్‌ కూడా చేయనున్నట్టు అధికారులు చెప్పారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని స్థానికులకు సూచించినట్టు చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ డాక్టర్‌ రాంబాబు తెలిపారు.

Read more