Advertisement

పొత్తులపై కేటీఆర్ స్టేట్‌మెంట్.. అసలు కథ ఇదేనా..?

Nov 21 2020 @ 12:36PM

గ్రేటర్‌ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుందా? ఎంఐఎంతో పొత్తు లేదని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడం వెనుక పకడ్బందీ వ్యూహం ఉందా? మొన్నటి వరకు ఆ పార్టీతో రాసుకు పూసుకు తిరిగిన గులాబీ పెద్దలు బల్దియా ఎన్నికల ముందు ఎందుకు ప్లేట్‌ పిరాయించారు? అసలేం జరుగుతోంది..? ఈ కథనంలో తెలుసుకుందాం..


బాంబ్ పేల్చిన మంత్రి కేటీఆర్...

గ్రేటర్‌ ఎన్నికల ప్రచార పర్వం సార్వత్రిక ఎన్నికల సమరాన్ని తలపిస్తోంది. బల్దియాలో విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రచారానికి వాడుకుంటున్నాయి. వరదసాయం బీజేపీ ఆపిందన్న విషయంపై ఇరు పార్టీల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. బండి సంజయ్‌ సవాల్‌లో భాగంగా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌ రాకకోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎదురుచూశారు. మరోవైపు గురువారం మంత్రి కేటీఆర్‌ పేల్చిన బాంబు పొలిటికల్‌ వాతావారణాన్ని మరింత వేడేక్కించింది. ఎంఐఎంతో పొత్తు లేదని ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.


దుబ్బాక ప్రభావం గ్రేటర్‌‌పై పడొద్దని...

వాస్తవానికి తెలంగాణలో ఎంఐఎం, టిఆర్ఎస్‌ మధ్య బంధం బహిరంగ రహస్యమే. ఓవైసితో దోస్తీ గురించి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును బాజాప్తాగా చెబుతున్నా.. ఓవైసి మాకు స్నేహితుడే అన్నారు. అంతేకాదు ఇటీవల జీహెచ్ఎంసి ఎన్నికలపై సీఎం కేసిఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అసదుద్దీన్‌ ఓవైసిని పిలిపించుకుని మరీ చర్చించారు. దుబ్బాక ఓటమి ప్రభావం గ్రేటర్‌పై పడకుండా టిఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటుంది. గ్రేటర్‌ ఎన్నికల్లో జనం దృష్టిని మరల్చేందుకే కేటీఆర్‌ ఎంఐఎంతో పొత్తు లేదని ప్రకటన చేశారన్న చర్చ జరుగుతోంది.

 

కమలం పార్టీకి అడ్వాంటేజ్ అవ్వొద్దని...

మరోవైపు హైదరాబాద్‌లో బిజేపి వర్సెస్ ఎంఐఎం అన్నట్లే వాతారవణం ఉంటుంది. గతంలో 99 సీట్లు సాధించి ఇప్పుడు మేయర్ పీఠం ఖాయమంటున్న టిఆర్ఎస్‌ కాకుండా.. మజ్లిస్‌ పార్టీ తమ ప్రధాన ప్రత్యర్థి అంటోంది బిజేపి. ఈ నినాదంతో అటు ఎంఐఎం, ఇటు టిఆర్ఎస్‌ను దెబ్బకొట్టచ్చన్నది బిజేపి ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఐఎంతో టిఆర్ఎస్ స్నేహం బహిరంగ రహస్యమే అయినా.. ఆ పార్టీతో పొత్తులు లేవని కేటిఆర్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఎంఐఎం సిట్టింగ్ స్థానాల్లో కూడా గత ఎన్నికల్లో గెలిచామన్నారు. మజ్లిస్‌తో తమ దోస్తీ కమలం పార్టీకి అడ్వాంటేజ్‌గా మారొద్దని టిఆర్ఎస్ పెద్దలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈసారి కూడా అదే ప్లాన్‌ అమలు..

గ్రేటర్‌ పోరులో రహస్య పొత్తులు రసవత్తరంగా ఉంటాయి. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎంతో ఒక అవగహనకు వచ్చి 150 డివిజన్లలో పోటీచేసింది. పాతబస్తీ పరిధిలో టిఆర్‌ఎస్‌కు బలం ఉన్న చోట మజ్లిస్‌ డమ్మీ అభ్యర్ధులను పోటీలో నిలపగా, మజ్లిస్‌కు బలం ఉన్న చోట టిఆర్‌ఎస్‌ కూడా అదే విధానం అమలుచేసింది. దీంతో రెండు పార్టీలు ముందుగా చేసుకున్న రాజకీయ ఒప్పందం సక్సెస్‌ అయ్యింది. దాంతో టిఆర్ఎస్ 99 స్థానాలు గెలిచి మేయర్‌ పీఠం సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఇదే ప్లాన్‌తో టిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎన్నికలకు వెళుతున్నట్లు తెలుస్తోంది.


జోష్ మీదున్న బీజేపీ...

మరోవైపు దుబ్బాక విజయంతో జోష్‌ మీదున్న కమలం పార్టీ.. గ్రేటర్‌ పీఠంపై ఫోకస్‌ చేసింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల ప్రపుల్‌ రాం రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి టిఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి, రేవంత్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు కొప్పుల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌, తదితరులను తమ గూటికి తీసుకురావడంలో బిజెపి సక్సెస్‌ అయింది. మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ తెలిపారు. కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. మొత్తంగా రహస్య ఒప్పందం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.