కుక్కునూరు కకావికలం

ABN , First Publish Date - 2022-07-20T08:20:57+05:30 IST

కుక్కునూరు కకావికలం

కుక్కునూరు కకావికలం

నేలకూలిన వందలాది ఇళ్లు 

ఉభయ గోదావరి లంక గ్రామాల్లో తగ్గిన వరద

అయినా జలదిగ్బంధంలోనే ఇళ్లు, పంటలు


కుక్కునూరు/నరసాపురం, జూలై 19: గోదావరి వరదకు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని గ్రామాలు కకావికలమయ్యాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామాలు నేడు బురదతో నిండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు గోదావరి మహోగ్రరూపానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా నీట మునిగిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయల్పడుతున్నాయి. వారం రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు ఇళ్లకు వెళ్తున్నారు. అయితే, తమ ఇళ్లు నేలకొరిగిపోయి ఉండడం, గోడలు దెబ్బతినడం, బురద పేరుకు పోవడం వంటి దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇళ్ల లోపల, బయట బురదమయంగా మారింది. పూరిళ్లు రూపురేఖలు కోల్పోయాయి. తలుపులు, ఇంట్లో ఉంచిన సామాగ్రి సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. విద్యుత్‌ తీగలు ఎక్కడకక్కడ తెగిపడ్డాయి. గ్రామాల్లో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. మళ్లీ ఎప్పటికి తేరుకుంటామోనని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘ఏటా గోదావరి వరదలకు భయపడుతూ బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చిన గోదావరి మాలాంటి వారి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. పోలవరం పరిహారం ఇచ్చి పంపిస్తే ఇక్కడ నుండి వెళ్లి మా బతుకులు మేం బతుకుతాం’ అని కుక్కునూరుకు చెందిన నిర్మలా నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వరద విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. వరద ప్రత్యేకాధికారిగా నియమితులైన మురళీధర్‌రెడ్డి తాళ్లరేవు మండలంలోను, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పి.గన్నవరం మండలంలోను వరద ప్రాంతాల్లో పర్యటించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వెంబడి ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా గండం గట్టెక్కిదంటూ గోదారమ్మకు పూజలు చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం రూరల్‌ మండలంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. 


ఖాళీ అవుతున్న పునరావాస కేంద్రాలు

వశిష్ఠ గోదావరికి వరద తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల్లోని వారు నెమ్మదిగా తమ ఇళ్లకు చేరుతున్నారు. అయితే, లంక గ్రామాలు మాత్రం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆచంట మండలంలో 9, యలమంచిలి మండలంలో 6, నరసాపురం మండలంలో రెండు, పట్టణంలోని చినమామిడిపల్లి, లాకుపేటల్లో ఇంకా వరద వీడలేదు. పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. బియ్యం, కూరగాయలు, పాల ప్యాకెట్లను  ఆయా సంస్థల వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు.  


ఆహార పంపిణీలో ఆధిపత్య పోరు

జనసేన సర్పంచ్‌ భర్తపై వైసీపీ నేతల దాడి

గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార పొట్లాల పంపిణీలో అధికార వైసీపీకి చెందిన నాయకులు ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారు. విపక్ష నేతలపై కూడా దౌర్జన్యాలకు దిగుతున్నారు. అప్పనపల్లిలో 5,500 మంది జనాభా నివసిస్తుంటే కేవలం 1500 మందికే ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారని, అది కూడా వైసీపీ వర్గాల వారికే చేరుతున్నాయని, బాధితులెవరికీ పంపిణీ చేయడం లేదంటూ గ్రామస్తులు అధికారులపై విరుచుకుపడ్డారు. పి.గన్నవరం మండలం నాగుల్లంక, బుట్టాయిలంకలో ఆహార పొట్లాల పంపిణీ విషయంలో జనసేనకు చెందిన సర్పంచ్‌ కృష్ణవేణి భర్త యల్లమిల్లి చిట్టిబాబుపై గ్రామంలోని వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బాధితులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆహార పొట్లాలు అందిస్తున్నారి వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. ఈ విషయంపై సర్పంచ్‌ భర్త యల్లమిల్లి చిట్టిబాబు బాధితులకు ప్రభుత్వం అందిస్తుంటే ఎమ్మెల్యే భిక్ష అంటూ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం చెందిన వైసీపీ నేతలు అతనిపై దాడికి దిగారు. దాంతో సర్పంచ్‌ భర్తకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-07-20T08:20:57+05:30 IST