2 నెలల్లో 20 కేజీలు తగ్గి ఆర్మీలోకి ఎంట్రీ.. సరిగ్గా ఆరేళ్ల తర్వాత శవపేటికలో సొంతూరికి.. ఓ వీరసైనికుడి కథ ఇది..

ABN , First Publish Date - 2021-12-11T20:37:48+05:30 IST

తమిళనాడులోని ఇటీవల జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో వీర మరణం పొందిన కో-పైలెట్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియలు స్వగ్రామంలో ఘనంగా ముగిశాయి.

2 నెలల్లో 20 కేజీలు తగ్గి ఆర్మీలోకి ఎంట్రీ.. సరిగ్గా ఆరేళ్ల తర్వాత శవపేటికలో సొంతూరికి.. ఓ వీరసైనికుడి కథ ఇది..

తమిళనాడులోని ఇటీవల జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో వీర మరణం పొందిన కో-పైలెట్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియలు స్వగ్రామంలో ఘనంగా ముగిశాయి. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఝుంఝును ప్రాంతానికి చెందిన కుల్దీప్‌కు చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలనే కోరిక బలంగా ఉండేది. చిన్నప్పుడు బొమ్మ విమానాలతో ఆడుకుంటూ పైలెట్ కావాలని కలలు కంటూ ఉండేవాడు. పైలెట్ కావడమే జీవిత లక్ష్యంగా అడుగులు వేశాడు. ఆరడుగులు ఉండే కుల్దీప్ 2015లో ఎయిర్ ఫోర్స్‌కు ఎంపిక అయ్యేనాటికి 90 కేజీలు ఉండేవాడు. 


మెడికల్ టెస్ట్ సమయానికి 20 కేజీలు తగ్గాలని కజిన్ సూచించడంతో కేవలం రెండు నెలల్లో కఠినంగా శ్రమించి 20 కిలోలు తగ్గాడు. ఆ రెండు నెలలు కుల్దీప్ ఎంత కఠోర శ్రమ చేశాడో అతడి కజిన్ సచిన్ తాజాగా వెల్లడించాడు. `ఆ సమయానికి కల్దీప్ నాతో పాటు ముంబైలో ఉండేవాడు. మా ఫ్లాట్ అపార్ట్‌మెంట్‌ 14వ అంతస్థులో ఉండేది. ఆ రెండు నెలలు కుల్దీప్ లిఫ్ట్ ఉపయోగించకుండా 14 అంతస్థులూ మెట్లెక్కి వచ్చేవాడు. కాళ్లకు బరువులు కట్టుకుని రోజూ 10 కిలోమీటర్ల పరిగెత్తేవాడు. ఆ రెండు నెలలూ లిక్విడ్ డైట్ మీద ఉన్నాడు. 


ఎంతో కఠోర శ్రమతో కుల్దీప్ 2015 ఫిబ్రవరిలో తన కల నెరవేర్చుకున్నాడు. ఉద్యోగ సమయంలో కూడా అంతే కఠినంగా డైట్, వ్యాయామం చేసేవాడు. కొన్ని రోజుల కిందట నాకు ఫోన్ చేశాడు. సెలవు పెట్టి ఊరికి వస్తానని, సరదాగా తిరుగుదామని అన్నాడు. ఈ లోపే ఘోరం జరిగిపోయింద`ని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, కుల్దీప్‌కు గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. అలాంటి వ్యక్తి తమ గ్రామంలో పుట్టినందుకు గర్విస్తున్నామని ఆ ఊరి సర్పంచ్ అన్నారు. 

Updated Date - 2021-12-11T20:37:48+05:30 IST