కన్నడ భాషను ఎందుకు విస్మరించారో వివరణ ఇవ్వండి : కుమార స్వామి ఫైర్

ABN , First Publish Date - 2021-01-17T17:08:17+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి

కన్నడ భాషను ఎందుకు విస్మరించారో వివరణ ఇవ్వండి : కుమార స్వామి ఫైర్

బెంగళూరు : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం భద్రావతిలోని మిలటరీ క్యాంపస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ భవనానికి శంకు స్థాపన చేశారు. అయితే ఈ శిలాఫలకంలో ఆంగ్ల భాష, హిందీ భాషలున్నాయి. స్థానికమైన కన్నడ భాష మాత్రం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కుమార స్వామి ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భాషను నిర్లక్ష్యం చేశారని కుమార స్వామి తీవ్రంగా మండిపడ్డారు. భారత్ వైవిధ్యంతో కూడిన దేశమని, త్రిభాషా సూత్రాన్ని అవలంబించడం ద్వారా ఆయా రాష్ట్రాల భాషలను గౌరవించడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యమని ఆయన గుర్తు చేశారు.


కేంద్ర హోంమంత్రి త్రిభాషా సూత్రాన్ని విస్మరించడం కన్నడ భాషకు, ప్రజలకు అగౌరవమని కుమార స్వామి ఆరోపించారు. ఈ సంఘటన ద్వారా కన్నడ ప్రజానీకాన్ని ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భవన్నాన్నికన్నడ భూమిలోనే నెలకొల్పారని, ఈ భవనం కోసం కన్నడీగులు భూదానం చేశారని పేర్కొన్నారు. దీనిపై కచ్చితంగా హోంమంత్రి షా స్పందించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు. ‘‘కన్నడ భాషను ఎందుకు విస్మరించారో షా సమాధానం చెప్పి తీరాలి. భూమిని, భాషను రక్షించలేని వారికి పాలించే అధికారమే లేదు. కన్నడీగుల విషయంలో అమిత్‌షా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు.’’ అంటూ కుమార స్వామి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-01-17T17:08:17+05:30 IST