కుముద్‌ బెన్‌ జోషి : కొన్ని జ్ఞాపకాలు

Published: Thu, 17 Mar 2022 03:21:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కుముద్‌ బెన్‌ జోషి : కొన్ని జ్ఞాపకాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగేళ్లకుపైగా (నవంబర్ 26, 1985 నుంచి ఫిబ్రవరి 7, 1990 వరకు) గవర్నరుగా పనిచేసిన కుముద్ బెన్ జోషి మరణ వార్త, ఆమె దగ్గర పనిచేసిన నాకు చాలా విచారాన్ని కలిగించింది. మూడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నిక కావడమే కాకుండా, కేంద్ర సహాయ మంత్రిగా రెండుసార్లు పనిచేశారామె. అప్పట్లో అతిచిన్న వయసులో గవర్నరుగా నియమితమైన వ్యక్తిగా కూడా ప్రత్యేకతను సంతరించుకున్నారు. గవర్నరుగా పదవి స్వీకరించిన వెంటనే రాష్ట్రంలోని 23 జిల్లాలతోపాటు, రాష్ట్రం బయటకూడా పర్యటించి, తన ముందు వచ్చిన 13మంది గవర్నర్ల కంటే తాను క్రియాశీలకమైన గవర్నరునని చూపే ప్రయత్నం చేశారు.


గవర్నరుగా కుముద్ బెన్ జోషి పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే, హైదరాబాదు దగ్గర రామచంద్రాపురంలోని బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియనుగా ఉద్యోగం చేస్తున్న నన్ను గవర్నరు కార్యదర్శిగా పనిచేస్తున్న స్వర్గీయ డాక్టర్ చంద్రమౌళి ఐఏఎస్ సలహామేరకు, చేతన స్వచ్ఛంద సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా నియమించారు. ఆమె గవర్నరుగా ఉన్నంత కాలం నేను అక్కడే పనిచేశాను. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా స్వర్గీయ శారదా ముఖర్జీ గవర్నరుగా పనిచేస్తున్న రోజుల్లో ఆమె కార్యదర్శి మోహన్ కందా సలహా మేరకు గవర్నరు అధ్యక్షతన స్థాపించబడిన సంస్థ చేతన. ఆమె వెళ్ళిపోయిన తరువాత అచేతనంగా పడివున్న ఆ సంస్థను పునరుద్ధరించే దిశగా నన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. నాకున్న లైబ్రరీ అనుభవం నేపథ్యంలో కుముద్ బెన్ జోషి ఆదేశాల మేరకు రాజ్‌భవన్ లైబ్రరీని కూడా ఒక పద్ధతిలోకి తీసుకువచ్చాను.


గవర్నరుగా పనిచేస్తున్న రోజుల్లో ఆమె అధ్యక్షతన వున్న చేతన సంస్థ ద్వారా నిరంతరం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేవారు కుముద్ బెన్ జోషి. భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం, పొగలేని పొయ్యిల వాడకం ప్రచారం, భారీ వర్షాలు కురిసినప్పుడు రెడ్‌క్రాస్‌కు సహాయంగా వరద సహాయక కార్యక్రమాలు లాంటివి చేతనా ద్వారా జరిగేవి. కుముద్ బెన్ జోషి అధ్యక్షతన నెలకొల్పబడిన మరో స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా). రెడ్‌క్రాస్‌ సంస్థ ఎలాగూ ఉంది. నీసా కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో గవర్నరు కార్యదర్శి స్వర్గీయ చంద్రమౌళి, అప్పట్లో రెడ్‌క్రాస్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న స్వర్గీయ డాక్టర్ ఎపి రంగారావు జోషికి చేదోడు వాదోడుగా ఉండేవారు. నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయడానికి ఆమె అహర్నిశలు కృషి చేసేవారు. హైదరాబాదులో వున్న రెడ్‌క్రాస్‌ అనుబంధ సంస్థలను మెరుగుపరచడం జరిగింది. చేతన, నీసా, రెడ్ క్రాస్ సంస్థలు మూడూ కూడా రాజ్‌భవన్ భవన సముదాయంలోనే కార్యకలాపాలు నిర్వహించేవి. నీసా ఆధ్వర్యంలో కుముద్ బెన్ జోషి చొరవతో విజయవంతంగా నిర్వహించిన ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమం– తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్, తదితర జిల్లాల్లో పాతుకుపోయిన జోగిని వ్యవస్థను రూపుమాపడం. స్వర్గీయ లవణం, హేమలత లవణం సహాయ సహకారాలతో వర్నిలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు కుముద్ బెన్ జోషి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టిన రోజైన జనవరి 31, 1988 నాడు చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్‌భవన్ దర్బారు హాలులో ముగ్గురు జోగినిలకు వివాహం జరిపించారు. పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ సమక్షంలో జరిగిన ఆ వివాహాలకు నాటి కేంద్రమంత్రి జలగం వెంగళరావు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హాజరయ్యారు. మర్నాటి పత్రికలలో పొగడ్తలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. జోగిన్ల సమస్యపై చర్చను జాతీయ స్థాయికి చేర్చటానికి న్యూఢిల్లీలో రెండురోజుల జాతీయ సమావేశాన్ని కూడా ఆమె తన అధ్యక్షతన నిర్వహించారు. నాటి కేంద్ర మంత్రులు పీవీ నరసింహారావు, జలగం వెంగళరావులేగాక స్వామి అగ్నివేష్ లాంటి ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.


జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థల సమావేశాన్ని కూడా హైదరాబాదు రాజ్‌భవన్‌లో కుముద్ బెన్ జోషి అత్యంత విజయవంతంగా నిర్వహించారు. నీసా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించిన మరో కార్యక్రమం భారతరత్న ఇందిరమ్మ రూపవాణి ప్రదర్శన. తొలుత హైదరాబాదులోను, దరిమిలా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలలోను, ఢిల్లీ నగరంలో కూడా ఈ ప్రదర్శన జరిగింది. అప్పట్లో రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్న మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి ఈ రూపవాణి కార్యక్రమంలో ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. దేశంలోని పలువురు రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు ఈ ప్రదర్శనకు అతిథులుగా వచ్చి ఆసాంతం తిలకించి ప్రశంసల వర్షం కురిపించారు. చలన చిత్ర దర్శక నిర్మాత, అలనాటి సినీరంగ ప్రముఖుడు స్వర్గీయ కేబీ తిలక్ ఈ కార్యక్రమానికి రూపకర్త. ఆయన చొరవతో రాజ్‌భవన్ ప్రాంగణంలో అమెరికా సాంకేతిక సహాయంతో రూపుదిద్దుకున్న డోమ్ హౌజ్ నిర్మాణం కూడా కుముద్ బెన్ జోషి గవర్నరుగా ఉన్నప్పుడే జరిగింది. ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం కూడా నెలకొల్పారు జోషి.


కుముద్ బెన్ జోషి గవర్నరుగా ఉన్న రోజుల్లోనే రెడ్‌క్రాస్‌ సంస్థ ఎంతో ముమ్మరంగా పని చేసింది. కరువు కాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా, మరే ఉపద్రవం సంభవించినా ‘నేనున్నాను’ అంటూ ఆమె ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ సేవలు అందించేది. రెడ్‌క్రాస్‌ మరింత ప్రాచుర్యంలోకి రావటానికి సభ్యత్వ కార్యక్రమం, ఉపాధ్యక్షుల నియామకం ఆమె హయాంలోనే జరిగింది. కుముద్ బెన్ జోషి గవర్నరుగా ఉన్న కాలంలోనే భారత పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఒక బెనిఫిట్ మ్యాచ్ నిర్వహించారు. నేటి పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జట్టుకు నాయకత్వం వహించగా, భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మాచ్‌కు కొద్ది రోజుల ముందే హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో మతకలహాలు చెలరేగాయి. ఆ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం చుట్టూ మైదానంలో కుముద్ బెన్ జోషి సారథ్యంలో మేమంతా చుట్టి రావడం నాకింకా గుర్తుంది. కుముద్ బెన్ జోషి ఎన్ని కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ ఆమె దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని అత్యంత ఆప్యాయంగా చూసుకునేవారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో అప్పట్లో మంచి ఉద్యానవనం వుండేది, ఆవులు వుండేవి. ఆమె ఆదేశాల మేరకు క్వార్టర్స్‌లో వున్న మాలాంటి సిబ్బందికి పాలు వస్తుండేవి. కుముద్ బెన్ జోషికి చింతపండు పులిహోర, మొక్క పెసలు, గోధుమలు, చల్ల మిరపకాయలు అంటే చాలా ఇష్టం. అవి విరివిగా దొరికే మా ఇంటికి ఆమె హోదా పక్కన పెట్టి చాలాసార్లు వచ్చారు. ఆమె అన్నగారి పిల్లలూ మా పిల్లలూ కలసి ఆడుకొనేవారు. గవర్నర్ హోదాను ఆమె ఎప్పుడూ ప్రదర్శించకపోయేది.

వనం జ్వాలానరసింహారావు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.