ప్రభుత్వమే మనది.. ఎవడేం పీకలేడు!.. కుంటశ్రీనివాస్ సంచలన ఆడియో

ABN , First Publish Date - 2021-02-18T20:32:10+05:30 IST

హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిని హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కుంట శ్రీను. వామనరావు మరణించే ముందు చెప్పిన పేరు కూడా ఇదే.

ప్రభుత్వమే మనది.. ఎవడేం పీకలేడు!.. కుంటశ్రీనివాస్ సంచలన ఆడియో

పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిని హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కుంట శ్రీను. వామనరావు మరణించే ముందు చెప్పిన పేరు కూడా ఇదే. ఈ కుంటశ్రీను మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. హత్యకు సంబంధించి బేరం కుదుర్చుకోవడం ఆ ఆడియోలో ఉంది. ‘ప్రభుత్వమే మనది.. ఎవడేం పీకలేడు’ అంటూ కుంట శ్రీను మాట్లాడిన తీరు సంచలనం సృష్టిస్తోంది. ఈ సంచలన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఫ్యాక్షన్ హత్యలను తలపించేలా..

వామనరావు దంపతులను హత మార్చిన తీరు ఫ్యాక్షన్‌ హత్యలను తలపిస్తోంది. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. వామనరావు దంపతులు ఇద్దరూ మంథని ప్రాంతానికి చెందిన పలు వివాదాస్పద కేసులను వాదిస్తుంటారు. ఈ ప్రాంతంలో జరిగే అనుమానాస్పద ఘటనలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి అవి విచారణకు వచ్చేలా చేస్తుంటారు. అలాగే వామనరావు స్వగ్రామమైన గుంజపడుగులో రామస్వామి గోపాలస్వామి రామాలయానికి ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు వామనరావు సోదరుడు ఇంద్రశేఖర్‌ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. తన తమ్ముడిని కాదని గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ వసంతరావు పుట్ట మధుకర్‌ చేత బ్రాహ్మణ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరింపజేసి కమిటీ వేయించాడని వామనరావు కినుక వహించినట్లు తెలిసింది. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ అనుమతుల్లేకుండా ఇంటి నిర్మాణం, ఆలయ నిర్మాణం చేపట్టడంపైనా కేసులు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మంథని ప్రాంతంలో తమకు ఇబ్బందిగా మారారని భావించిన హంతకులు వామనరావు దంపతులను చంపి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. వారు మంథని వస్తున్న సమాచారాన్ని ముందే తెలుసుకుని ఈ హత్యకు పథకం పన్నినట్లుగా తెలుస్తోంది.


పోస్టు మార్టం పూర్తి

పెద్దపల్లి జిల్లా ఏరియా ఆస్పత్రిలో న్యాయవాది దంపతులకు పోస్ట్ మార్టం పూర్తి అయింది. పోస్ట్ మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను పోలీసులు గుంజపడుగు గ్రామానికి తీసుకెళ్లారు. గుంజపడుగులో అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - 2021-02-18T20:32:10+05:30 IST