Kuppamలో మొదలైన ఎన్నికల సందడి.. తిరుగులేని TDP.. రంగంలోకి దిగిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ABN , First Publish Date - 2021-10-19T06:37:10+05:30 IST

కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్‌ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పెండింగ్‌ పడిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే క్రమంలో పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేయాలంటూ ఆదేశించడంతో కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలే ప్రధాన చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్‌ సోమవారం తీసుకున్న ఈ నిర్ణయంతో పట్టణ వైసీపీ నేతలంతా హుటాహుటిన సదుం బయల్దేరి వెళ్ళారు.

Kuppamలో మొదలైన ఎన్నికల సందడి.. తిరుగులేని TDP.. రంగంలోకి దిగిన ఎంపీ మిథున్ రెడ్డి..!
కుప్పం మున్సిపాలిటీ

  • కుప్పం మున్సిపోల్‌ సందడి

కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్‌ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పెండింగ్‌ పడిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే క్రమంలో పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేయాలంటూ ఆదేశించడంతో కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలే ప్రధాన చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్‌ సోమవారం తీసుకున్న ఈ నిర్ణయంతో  పట్టణ వైసీపీ నేతలంతా హుటాహుటిన సదుం బయల్దేరి వెళ్ళారు. అక్కడ రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డితో సమావేశమయ్యారు. మరోవైపు పట్టణ టీడీపీ నేతలు సైతం కంగుందిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబు పీఏ మనోహర్‌, ముఖ్యనేత మునిరత్నంలతో సమావేశమయ్యారు. ఇంకోవైపు ఈ నెలాఖరులోపే చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపధ్యంలో కుప్పం రాజకీయం మరింత వేడెక్కనుంది.



తిరుపతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయతీగా వున్న కుప్పం పంచాయతీని వైసీపీ ప్రభుత్వం 2019 డిసెంబరులో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసింది. 25 వార్డులతో ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో ఎన్నికల కసరత్తు మొదలైనప్పటికీ పన్నుల భారం భరించలేమంటూ సామగుట్టపల్లె, లక్ష్మీపురం, దళవాయి కొత్తపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే వార్డులకు, ఛైర్‌పర్సన్‌ పదవికి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మరోవైపు  వార్డు అభ్యర్థులను, ఛైర్మన్‌ అభ్యర్థులను కూడా వైసీపీ, టీడీపీ ఖరారు చేసేశాయి. ఆయా అభ్యర్థులు రెండు నెలలుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇపుడు కోర్టు కేసు అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలైంది. ఈ నెలాఖరులోనో లేకుంటే వచ్చే నెల మొదటి వారంలోనో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. ఫలితంగా కుప్పం పట్టణంలో పూర్తి స్థాయి ఎన్నికల వాతావరణం అలుముకుంటోంది. 


సదుంలో ఎంపీ మిధున్‌ సమీక్ష

 కుప్పం పట్టణానికి చెందిన వైసీపీ నేతలు సోమవారం హుటాహుటిన సదుం బయల్దేరి వెళ్ళారు. వారిలో ఛైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులంతా వున్నారు. సదుంలో వీరితో సమావేశమైన ఎంపీ మిధున్‌రెడ్డి ఎన్నికల ప్రచారం, ఇతరత్రా ఏర్పాట్ల గురించి సమీక్షించినట్టు సమాచారం. దీంతో పంచాయతీ ఎన్నికల వలె గాక, మున్సిపల్‌ ఎన్నికలను మంత్రి బదులు ఎంపీ పర్యవేక్షిస్తారన్న ప్రచారం మొదలైంది.


కంగుందిలో టీడీపీ సన్నాహక సమావేశం

 టీడీపీ నాయకులు కూడా సోమవారం కంగుందిలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు పీఏ మనోహర్‌, నియోజకవర్గ మాజీ ఇంఛార్జి మునిరత్నం నిర్వహించిన ఈ సమావేశంలో ఛైర్మన్‌, వార్డు అభ్యర్థులతో పాటు ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే చేస్తున్న ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడం, వైసీపీ ఎత్తుగడలను ఎలా ఎదుర్కొనాలనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. త్వరలో కుప్పానికికి రానున్న చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాల్సిన అంశాలు, కోరాల్సిన సాయాల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది.


ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకం

కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు అధికార, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఇక్కడ గెలవడం వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా కూడా చంద్రబాబుకు అవసరం. అలాగే ఈ ఏడాది జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టామని సంబరపడుతున్న వైసీపీ ముఖ్యనేతలకు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధించడం చాలా అవసరం. ఇక్కడ విజయం సాధించి ఆ విషయాన్ని రాష్ట్రమంతా ప్రచారం చేసుకునే వ్యూహంతో ఆ పార్టీ ముఖ్యనేతలు వున్నారు. పార్టీ అధికారంలో వుండడం, వనరులపరంగా వైసీపీకి అడ్డు ఉండదు. కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ముందుగానే బహిష్కరించినందున వాటి ఫలితాలను టీడీపీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతానికైతే మున్సిపల్‌ ఎన్నికల్లో బలం చాటుకుని వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న పట్టుదల స్థానిక టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 


కుప్పంలో తిరుగులేని టీడీపీ

కుప్పం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతం సంగతి పక్కన పెడితే ప్రత్యేకించి పట్టణంలో వైసీపీ చాలా బలహీనంగా వుంది. దానికి తోడు వైసీపీ శ్రేణుల్లో నాయకత్వంపై విపరీతమైన అసంతృప్తి వుంది. సమస్యలు తీర్చే నాయకులు ఆ పార్టీలో లేరు. పట్టణంలో పార్టీకి బలం లేకున్నా గ్రూపులకు కొదువ లేదు. అదే టీడీపీ విషయానికొస్తే పట్టణంలో ఆ పార్టీకి తిరుగులేదు. నిజానికి మున్సిపల్‌ ఎన్నికల్లో ఇక్కడ గెలుపుపై ఎలాంటి సందేహం లేదు. టీడీపీలోనూ రెండు గ్రూపులుండడం, స్థానిక నాయకత్వంపై శ్రేణుల్లో అసంతృప్తి వున్నా కూడా పార్టీ  బలంగానే వుంది.చంద్రబాబు కారణంగా కుప్పం పట్టణం అభివృద్ధి చెందడాన్ని కళ్ళారా చూసిన పట్టణవాసుల్లో టీడీపీపై అభిమానం ప్రస్ఫుటంగా వుంది. అయితే ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల నుంచీ ఎదుర్కొన్న వేధింపులు, పోలీసు కేసులు, ఆర్థిక ప్రలోభాలు వంటివి పట్టణంలో కూడా పునరావృతమవుతాయన్న ఆందోళన, భయం టీడీపీ శ్రేణుల్ని వెంటాడుతున్నాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగితే విజయానికి ఢోకా లేదని శ్రేణులు భావిస్తున్నాయి.త్వరలో చంద్రబాబు పర్యటించనుండడంతో కుప్పం రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Updated Date - 2021-10-19T06:37:10+05:30 IST