Chandrababu కంటతడి చూడలేక.. కుప్పంలో...!

ABN , First Publish Date - 2021-11-20T12:54:21+05:30 IST

Chandrababu కంటతడి చూడలేక.. కుప్పంలో...!

Chandrababu కంటతడి చూడలేక.. కుప్పంలో...!

  • మహిళానేత ఆత్మహత్యాయత్నం
  • భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
  • పలు చోట్ల జగన్‌, కొడాలి నానీ, అంబటి రాంబాబు దిష్టి బొమ్మల దగ్ధం 
  • తీవ్రంగా ఖండించిన పలువురు ముఖ్య నేతలు

చిత్తూరు జిల్లా/తిరుపతి : శాసనసభలో వైసీపీ నేతల తీరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటతడి పెట్టడంపై జిల్లాలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.అసెంబ్లీ పరిణామాలు, ఆ సందర్భంగా చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడిన తీరు, ముఖ్యంగా కన్నీరు పెట్టడం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులను కదిలించింది.  తీవ్ర మనస్తాపానికి గురైన కుప్పం మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు వసంతమ్మ (42) విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుంగనూరు మండలం వనమలదిన్నెలో తెలుగుయువత కార్యకర్తలు  సీఎం జగన్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు. 


తిరుపతి నగరం ఎన్టీఆర్‌ కూడలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.అంబేడ్కర్‌ కూడలిలో పార్టీ నేతలు నరసింహయాదవ్‌, శ్రీధర్‌ వర్మ, కోడూరు బాలసుబ్రమణ్యం, రాగల ఆనంద్‌ గౌడ్‌ తదితరులు కార్యకర్తలతో కలసి నిరసనగా బైఠాయించారు.పోలీసులు వారందరినీ అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లి కూడలిలో టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శ్రీకాళహస్తి అంబేడ్కర్‌ కూ డలిలో  చక్రాల ఉష ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.విజయపురం కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించగా నగరిలోని ఎన్టీయార్‌ విగ్రహ కూడలిలో ధర్నా చేపట్టారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పలువురు నేతలు మీ డియా సమావేశాలు నిర్వహించి చంద్రబాబు పట్ల వైసీపీ తీరును ఎండగట్టగా మరికొందరు ఖండిస్తూ ప్రకటనలు చేశారు.


కాలగర్భంలో కలసిపోతారు 

రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విశేష సేవలందించిన చంద్రబాబు కంటతడికి కారకులు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలసిపోతారని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య తప్పదని, వైసీపీ నేతలు సమీప భవిష్యత్తులోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి హెచ్చరించారు.రాష్ట్ర రాజకీయాల్లోనూ, ప్రభుత్వ పాలనలోనూ చంద్రబాబు పేరే ఓ బ్రాండని, ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్‌ సిటీ, ప్రస్తుత రాజధాని అమరావతి సహా పలు అంశాలు ఆయన దార్శనికతను ప్రపంచానికి చాటి చెబుతున్నాయన్నారు. 


చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకూ సమస్యలపై ప్రజాక్షేత్రంలోనే పోరాడుతారని, ఆయన వెంట రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ప్రజలు వున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీని మట్టి కరిపించి ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమన్నారు.చంద్రబాబును తూలనాడిన ఎమ్మె ల్యేలను సీఎం జగన్‌ వారించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. చంద్రబాబును అవమానకరంగా మాట్లాడిన మంత్రులు వెంటనే క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు డిమాండు చేశారు.చంద్రబాబును దూషించిన వైసీపీకీ పుట్టగతులుండవని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-11-20T12:54:21+05:30 IST