వైసీపీలో ముసలం.. మంత్రి పెద్దిరెడ్డి వద్దకు పంచాయితీ

ABN , First Publish Date - 2022-02-20T12:24:34+05:30 IST

వైసీపీలో ముసలం.. మంత్రి పెద్దిరెడ్డి వద్దకు పంచాయితీ

వైసీపీలో ముసలం.. మంత్రి పెద్దిరెడ్డి వద్దకు పంచాయితీ

చిత్తూరు జిల్లా/కుప్పం : కుప్పం మున్సిపల్‌ వైసీపీలో ముసలం పుట్టింది. నిజానికి మున్సిపల్‌ ఛైర్మన్‌తోపాటు ఇద్దరు వైస్‌ ఛైర్మన్లను ఎన్నుకోవడం నుంచీ ఇది మొదలైంది. తాజాగా వైస్‌ ఛైర్మన్‌ హఫీజ్‌ ఏకంగా తొమ్మిది మంది కౌన్సిలర్లను వెంటబెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం, వారివెంట రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ దన్నుగా వెళ్లడం పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీనుంచి ఏకంగా 19 మంది వార్డు కౌన్సిలర్లుగా ఎన్నిక కాగా తెలుగుదేశం పార్టీ కేవలం 6మంది కౌన్సిలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


మున్సిపల్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ సుధీర్‌కు ఆ పదవి వరించింది. అయితే అధికార పార్టీ లోనే బలమైన వర్గాలుగా కొనసాగుతున్న రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌లకు అస్మదీయులైన హఫీజ్‌, మునస్వామిలను వైస్‌ ఛైర్మన్లుగా చేయడం అనివార్యమైంది. ఇక్కడే విభేదాలకు బీజం పడింది. కుప్పం మున్సిపల్‌ అభివృద్ధికి తాజాగా ఎటువంటి అభివృద్ధి పనులూ మంజూరు కాలేదు కానీ, తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరై వెనక్కు వెళ్లిపోయిన రూర్బన్‌ నిధులను తిరిగి తెప్పించడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సఫలీకృతులయ్యారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా ఆ నిధులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల నిర్మాణాలు జోరుగా సాగాయి.


పనుల పంపకంలో అసమానతలు..

అభివృద్ధి పనులను అన్ని వార్డులకు సమానంగా పంచలేదన్న ఆరోపణలు వినిపించాయి. అంతేకాక తమను చిన్నచూపు చూస్తున్నా రన్న అనుమానం సెంథిల్‌ వర్గమైన వైస్‌ ఛైర్మన్‌ హఫీజ్‌తోపాటు మరికొంతమంది కౌన్సిలర్లలో మొదలైంది. మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ చాంబర్‌కు పోటీగా వైస్‌ ఛైర్మన్‌ చాంబర్‌ను హఫీజ్‌ ఏర్పాటు చేసుకోవడం దీనికి నిదర్శనంగా నిలిచింది. ఈలోగా కో ఆప్షన్‌ సభ్యుడి నియామక ప్రక్రియ ఈ విభేదాలను మరింత పెంచింది. సెంథిల్‌ వర్గం,  డాక్టర్‌ సుధీర్‌ వర్గాలు వేర్వేరు వ్యక్తులను ఈ పదవికి ముందు కు తోశాయి. ఈ నేపథ్యంలోనే వైస్‌ ఛైర్మన్‌ హఫీజ్‌ తనతోపాటు 9 మంది కౌన్సిలర్లను తీసుకుని, మార్గదర్శకుడైన సెంథిల్‌ను వెంటబెట్టు కుని శుక్రవారం తిరుపతికి వెళ్లి మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. 


మరోవైపు తనకు అందుబాటులో ఉన్న కొంతమంది కౌన్సిలర్లను వెంట బెట్టుకుని మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ కూడా మంత్రి నివాసానికి చేరు కున్నారు. కుప్పం నాలుగు మండలాల్లో ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరేందుకోసమే తాము మంత్రిని కలసినట్టు హఫీజ్‌ వర్గం చెబుతున్నా, వారి కలయికకు కేవలం ఇదొక్కటే కారణం కాదని అంటున్నారు. అభివృద్ధి పనుల పంపకాల్లో తమపట్ల ఛైర్మన్‌ వివక్ష చూపుతున్నారని మంత్రికి వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే పార్టీలోని కొందరు ప్రముఖులు మంత్రి పేరు చెప్పి ‘వసూళ్ల’కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేసి నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఫిర్యాదులు, ఆరోపణలను మంత్రి పెద్దిరెడ్డి సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. 


కాగా మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధీర్‌ పనితీరును మెచ్చుకున్నట్లు తెలిసింది.అలాగే సమీప భవిష్యత్తులో కుప్పం మున్సిపల్‌ అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయనున్నదని, ఈ మొత్తాన్ని అన్ని వార్డులకూ సమానం గా పంచి అభివృద్ధి చేయాలని సుధీర్‌కు హితవు పలికినట్లు తెలిసింది. దీంతో హఫీజ్‌ వర్గం కాస్త తగ్గి వెనక్కు వచ్చేసినట్లు చెబుతున్నారు.  కుప్పంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మొత్తమ్మీద మంత్రి సమక్షంలో జరిగిన పంచాయితీలో విభేదాలు తాత్కాలికంగా సద్దుమణి గాయి కానీ, రగలవన్న గ్యారంటీ ఏమీలేదని వైసీపీ వర్గాలే అంటున్నాయి.

Updated Date - 2022-02-20T12:24:34+05:30 IST