సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, జేసీలు

Jun 16 2021 @ 23:32PM
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 16: కొవిడ్‌ ఎప్పటికీ జీరో స్థాయికి చేరుతుందనుకోవద్దని, కచ్చితంగా కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్‌-19, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాల భవనాలు, డా.వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ (రూరల్‌), ఏఎంసీయూఎస్‌, బీఎంసీయూఎస్‌, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ, జగన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, మౌలిక వసతుల కల్పన, ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల తదితర అంశాలపై కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వీర పాండియన్‌, జాయింట్‌ కలెక్టర్లు మనజీర్‌ జిలానీ సామూన్‌, శ్రీనివాసులు, నారపురెడ్డి మౌర్య, పంచాయితీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ అమర్‌నాథ్‌ రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలను విధిగా కొనసాగించాలన్నారు.  గ్రామాల్లో ఫీవర్‌ సర్వే ప్రతి వారం కొనసాగించాలన్నారు. కొవిడ్‌ పరీక్షలు వెంటనే చేసి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ అమలులో కలెక్టర్లను అభినందిస్తున్నామన్నారు. 89 శాతం మంది కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారని తెలిపారు. పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారం పడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 16 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. 104 అనేది వన్‌స్టాఫ్‌ సొల్యూషన్‌ వైద్యసేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రేట్ల కన్నా ఎక్కువ చార్జీలు వేయకూడదన్నారు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులను మూసి వేయడానికి సంకోచించవద్దని సూచించారు. జిల్లా స్థాయిలో వచ్చే రెండు నెలలకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆసుపత్రులను తీసుకువస్తున్నామన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు ఆర్‌బీకేల ద్వారా అందేలా చూడాలన్నారు. ప్రీమియం విత్తనాలు కూడా ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందించాలన్నారు. నకీలీలకు ఆస్కారం ఉండదని తెలిపారు. జూలై 3న మొదటి విడత 3 వేల ఆర్‌బీకేల పరిధిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నామన్నారు. అక్టోబరులో రెండో విడత, జనవరిలో మూడో విడత కస్టర్‌ హైరింగ్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలను ఆర్‌బీకేల స్థాయికి తీసుకురావాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడాలన్నారు. అలాగే థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం పడుతుందని, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జూన్‌ 22న చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని, కలెక్టర్లు సిద్ధం కావాలని సూచించారు. అలాగే జూలైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు, దీనికి సంబందించి కూడా కలెక్టర్లు సిద్ధం కావాలన్నారు. జూలై 1న వైఎస్సార్‌ బీమా ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.