కుల మతాల కురుక్షేత్రం యూపీ!

ABN , First Publish Date - 2022-01-20T05:45:22+05:30 IST

కుల,మత సమీకరణలే అనాదిగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ముస్లింలు, బ్రాహ్మణులు, దళితులను ప్రసన్నం చేసుకోగలిగితే అధికార పీఠానికి రాచబాట పడినట్లే...

కుల మతాల కురుక్షేత్రం యూపీ!

కుల,మత సమీకరణలే అనాదిగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ముస్లింలు, బ్రాహ్మణులు, దళితులను ప్రసన్నం చేసుకోగలిగితే అధికార పీఠానికి రాచబాట పడినట్లే. ఇదివరకటికన్నా మరింత స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యమిది. ప్రత్యేకించి రాష్ట్ర జనాభాలోను, ఓట్లలోను 20 శాతం లేదా అంతకుమించి ఉన్న ముస్లింల మద్దతు ఆయా పార్టీల జయాపజయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నప్పుడు, వారి వెంబడి రాజకీయపక్షాలు ఎందుకు పరుగులు తీస్తున్నాయో అర్థమవుతుంది. ఆసియాలోని అత్యంత పురాతనమైన, అతి పెద్ద ఇస్లామిక్‌ పీఠాల్లో ఒకటైన దేవ్‌బంద్‌ దారుల్‌–ఉలూమ్‌ మాట ముస్లింలకు  శిరోధార్యం కనుక వివిధ రాజకీయపక్షాలు దాని చల్లనిచూపు కోసం వెంపర్లాడుతుంటాయి. 2009 లోక్‌సభ ఎన్నికల విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, తన సన్నిహిత సహచరుడు, అత్యంత నమ్మకస్తుడైన అమర్‌సింగ్‌ను దూతగా పంపినప్పుడు దారుల్‌–ఉలూమ్‌ తలుపులు సైతం తెరుచుకోలేదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యుడైన కల్యాణ్‌సింగ్‌తో జట్టుకట్టినందుకు అమర్‌సింగ్‌కు జరిగిన పరాభవమిది. దాంతో తీవ్రంగా కలత చెందిన ములాయం, స్థానిక సమాజ్‌వాది నాయకుడి సహకారంతో దేవ్‌బంద్‌ ఇస్లామిక్‌ మతగురువుతో భేటీ కాగలిగారు. అయినా ఫలితం లేకపోయింది. తరువాత జరిగిన ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ అద్భుత విజయాలు నమోదు చేసింది. ముస్లింలు దారుల్‌–ఉలూమ్‌ మాట వినలేదా, లేక దారుల్‌–ఉలూమ్‌ అందించిన సంకేతాల ఆధారంగానే సమాజ్‌వాదికి కాకుండా కాంగ్రెస్‌కు ఓటు వేశారా అన్నది కచ్చితంగా చెప్పలేకపోయినా దారుల్‌–ఉలూమ్‌ ముందు చేయి చాచినప్పటికీ ముస్లిం ఓట్ల భిక్ష లభించగలదన్న హామీ లేని నేపథ్యంలో తరువాతి కాలంలో ఆ సంస్థ రాజకీయ ప్రాధాన్యం చాలావరకు తగ్గిపోయింది. అయినా దాన్ని పూర్తిగా తీసిపారేసే పరిస్థితి మాత్రం లేదు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 206 గెలుచుకుని మాయావతి విజయకేతనం ఎగురవేసినా; 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుని యూపీలో 22 సీట్లు కైవసం చేసుకోగలిగినా; 2012 ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీ అత్యద్భుత విజయాలు నమోదు చేసి, 224 సీట్లతో యూపీ పీఠమెక్కగలిగినా... ఆ విజయాలన్నింటిలో ముస్లిం ఓట్లదే కీలకపాత్ర.


ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ముస్లింలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. రుహెల్‌ఖండ్‌ (35 శాతం), పశ్చిమ యూపీ (32 శాతం), అవధ్‌ (17 శాతం), పూర్వాంచల్‌ (16 శాతం), దోవబ్‌ (12 శాతం), బుందేల్‌ఖండ్‌ (ఏడు శాతం)లలో అనేక నియోజకవర్గాలలో వారిదే ప్రాబల్యం. మరింత స్పష్టంగా చెప్పాలంటే, యూపీలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు 40 శాతానికి పైగానే ఉన్నారు. మరో 43 సీట్లలో వారి సంఖ్య 30 నుంచి 40 శాతం దాకా, తొమ్మిది నియోజకవర్గాల్లో 55 శాతం దాకా ఉంటుంది. ముస్లింలు కేవలం తమ ఓట్లతోనే 30 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తమ్మీద 170కి పైగా నియోజకవర్గాల్లో పార్టీల తలరాతల్ని తిరగరాయగల సామర్థ్యం వారి సొంతం. కాంగ్రెస్‌, బీఎస్పీల పోరాటం, ఆరాటం ఉనికి కోసమే పరిమితమైన తరుణంలో పక్కా ముస్లిం పార్టీ మజ్లిస్‌ రంగంలో ఉన్నప్పటికీ, బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే సత్తా కలిగిన సమాజ్‌వాది పార్టీకే ఈసారి ముస్లింలంతా గంపగుత్తగా ఓటువేసే సూచనలు ఉన్నాయి. బహుశా, అంతకుమించి మార్గం లేదు కనుక అందుకు భిన్నంగా జరగకపోవచ్చు.


ఉత్తరప్రదేశ్‌ సామాజిక, రాజకీయ రంగాల్లో దశాబ్దాలుగా తమ ప్రాధాన్యాన్ని చాటుకుంటున్న బ్రాహ్మణ సామాజికవర్గం ఈసారి ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేసే అవకాశాలు సుస్పష్టం. జాతవ్‌లు, యాదవుల తరువాత హిందువుల్లో బ్రాహ్మణ ఓటర్లదే సంఖ్యాధిక్యత. ముఖ్యంగా అవధ్‌, యూపీ తూర్పు ప్రాంతాల్లో ఈ సామాజికవర్గానికి గట్టి పట్టు ఉంది. రాష్ట్ర జనాభాలో 12 శాతం మేరకు బ్రాహ్మణులు ఉండగా, తూర్పు యూపీలో బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య 20 శాతానికి పైమాటే. మండల్‌, మందిర్‌ రాజకీయాలు తెరమీదకు వచ్చేదాకా కాంగ్రెస్‌నే అంటిపెట్టుకున్న బ్రాహ్మణులు, తరువాత బీజేపీ వైపు మొగ్గుచూపారు. వాస్తవంలో కాషాయదళానికి గట్టి ఓటుబ్యాంకుగా కూడా మారారు. కానీ, వారు ఎప్పటికీ ఏదో ఒక పక్షం వైపే ఉంటారనడానికి లేదు. పరిస్థితుల్ని, అవసరాల్ని బట్టి విధేయతలు మారుతుంటాయి. యూపీ జనాభాలో సుమారు ఏడు శాతం వరకు ఉన్న ఠాకూర్‌లు బ్రాహ్మణులకు బద్ధవ్యతిరేక వర్గం. వరుస వెంబడి ప్రధానమంత్రులుగా పనిచేసిన వీపీ సింగ్‌, చంద్రశేఖర్‌లే కాదు, యోగి ఆదిత్యనాథ్‌ సహా అయిదుగురు యూపీ సీఎంలూ ఈ సామాజికవర్గానికి చెందినవారే. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న మాట నిజమే కానీ, హిందుత్వ రాజకీయాల ఉధృతి పుణ్యమా అని బ్రాహ్మణులు ఉన్న పళాన బీజేపీ తెప్ప తగలేసి కాంగ్రెస్‌ లేదా ఎస్పీ పంచన చేరే అవకాశాలు మాత్రం అంతగా కనిపించడం లేదు.


యాదవేతర ఓబీసీలు యూపీలో మరో కీలకమైన సామాజిక సమీకరణం. ఈ వర్గానికి చెందిన కుర్మీ, మోర్య, కశ్యప, సైనీ, సాహు తదితరులు యూపీ జనాభాలో 35 శాతం వరకు ఉన్నారు. మండల్‌ ఉద్యమం తరువాత సమాజ్‌వాది సహా సోషలిస్టు పార్టీల శిబిరంలో చేరిన ఈ వర్గాలు, తరవాతి కాలంలో బీజేపీ పక్షాన నిలిచాయి. ఈసారీ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. ఇటీవలి రైతుఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కిన జాట్‌లు, ప్రధానంగా వ్యవసాయమే వృత్తిగా ఎదిగి పలురంగాల్లో ప్రాబల్యం చాటుకుంటున్నారు. యూపీ జనాభాలో వారి సంఖ్య రెండు శాతమే అయినప్పటికీ, ఇతర కులవర్గాలను ప్రభావితం చేసే శక్తిసామర్థ్యాలు ఉన్నందువల్లే జాట్లను సైతం ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవడం లేదు.


‘‘ఠాకూర్‌, బ్రాహ్మణ్‌, బనియా చోర్‌ – బాకీ సబ్‌ హై డీఎస్‌–4 (దళిత్‌ శోషిత్‌ సమాజ్‌ సంఘర్ష్‌ సమితి)’’ అంటూ 1981లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్‌వాది పార్టీకి, ఆయన తదుపరి సారథ్యం వహిస్తున్న మాయావతి అనూహ్య రీతిలో, అద్భుత స్థాయిలో దళిత, ముస్లిం, బ్రాహ్మణ సమీకరణాన్ని రూపొందించి, 2007లో సంచలనాత్మక విజయం సాధించి, యూపీ సీఎంగా చరిత్ర సృష్టించినప్పటికీ తరువాత ఎందుకో పట్టు నిలుపుకోలేకపోయారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 19 మంది పార్టీలు మారిపోగా, చివరకు ముగ్గురే మిగిలారు. దరిమిలా పార్టీని తిరిగి పట్టాలకెక్కించే కార్యక్రమానికి ఆమె దాదాపు నీళ్లు వదిలేశారు. తాజా ఎన్నికల్లో పోటీకి సైతం సిద్ధపడకుండా ఆమె తెరమరుగవుతున్న పరిస్థితుల్లో, ఇన్నాళ్లూ ఆమెకు అండగా నిలిచిన దళితులు ఇప్పుడు ఎవరి పక్షాన నిలుస్తారన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.


యూపీలోని మొత్తం ఓటర్లలో దళితులు 21 శాతం వరకు ఉన్నారు. వారిలో మాయావతి సొంత కులమైన జాతవ్‌లు సగానికి పైబడే ఉంటారు. జాతవ్‌లు, బ్రాహ్మణులకే మాయావతి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారని జాతవేతర దళితులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాల్మీకి, సోన్‌కార్‌, పాసి, కోరి సహా 60 జాతవేతర దళిత కులాలవారు ఏ పార్టీకి జైకొడతారన్నది అంతుపట్టకుండా ఉంది. బీఎస్పీ గట్టి పోటీదారు కాని నేపథ్యంలో దళిత ఓట్లు భారీగా చీలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. 


భారతీయ జనతాపార్టీ మరోసారి హిందుత్వ అజెండాను భుజానికెత్తుకున్న తరుణంలో సమాజ్‌వాది పార్టీ కనుక ముస్లింలు, దళితులను పెద్దయెత్తున ఆకర్షించగలిగితే పోరాటం హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏవిధంగా చూసినా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్నది కులమతాల కురుక్షేత్ర సంగ్రామమే!

పి. దత్తారాం ఖత్రీ

సీనియర్‌ జర్నలిస్టు

Updated Date - 2022-01-20T05:45:22+05:30 IST