కుట్టుమిషన్లు మాయం

ABN , First Publish Date - 2022-10-04T05:13:26+05:30 IST

సాక్షర భారతి పథకం కింద మండలానికి మంజూరైన సామగ్రి మాయమైపోయింది. ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులే ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కుట్టుమిషన్లు మాయం

ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై ఆరోపణలు 

కనిపించని సాక్షరభారతి సామగ్రి

అమడగూరు, అక్టోబరు 3: సాక్షర భారతి పథకం కింద మండలానికి మంజూరైన సామగ్రి మాయమైపోయింది. ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులే ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి సాక్షరభారతి పథకాన్ని కేం ద్ర ప్రభుత్వం గతంలో అమలులోకి తీసుకొచ్చిం ది. అందులో భాగంగా మండలం, గ్రామ పంచాయతీలకు కో-ఆర్డినేర్లను నియమించింది. వారిద్వారా గ్రామాల్లో రాత్రి బడులను ప్రారంభించారు. చదువుకోవడానికి వయోజనులకు పుస్తకాలు, పలకలు తదితరసామగ్రి పంపిణీ చేశారు. వీటితోపాటు మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రూ.15వేల విలువచేసే కుట్టుమిషన్లను మహిళలకు మంజూరు చేశారు. వీటితోపాటు కుర్చీలు, టేబుళ్లు, ఆట వస్తువులు, వెట్‌మిషన్లు వచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చిన వాటిని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో భద్రపరిచారు. స్థానిక ఎన్నికల సమయంలో వాటిని మాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఉద్యోగులు, ప్రజాప్రతినిధులే ఎత్తుకెళ్లారా?

సాక్షరభారతి పథకం కింద మంజూరైన కుట్టుమిషన్లు ఇతర సామగ్రిని ఎంపీడీఓ కార్యాలయంలోని అదనపు గదిలో ఉంచారు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఎంపీడీఓ కార్యాలయలో గదుల కొరత ఏర్పడింది. దీంతో కుట్టుమిషన్లు ఉంచిన గదిని ఉపాధి సిబ్బందికి కేటాయించారు. రెండుమూడేళ్లుగా నిలువ ఉన్న 7 కుట్టుమిషన్లు ఉన్నట్లుండి మాయమయ్యాయి. రాత్రికిరాత్రే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.. వాటిని ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ప్రజలకు దక్కాల్సిన వాటిని అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తీసుకెళ్లడం ఏంటని స్థానికులు మండి పడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది కొంతమంది బదిలీ అయ్యారు. ఇప్పటికైనా కుట్టుమిషన్లు ఎవరు తీసుకెళ్లారో తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. మిగతా సామగ్రి ఏమైందో కూడా చెప్పే నాథుడు లేడు.


విచారణ చేపడతాం: నసీమా, ఎంపీడీఓ

నేను ఇటీవలే మండలంలో బాధ్యతలు చేపట్టా. అంతకుమునుపే మంజూరైన కుట్టుమిషన్ల వ్యవహారం నాకు తెలీదు. దీనిపై విచారణ చేపడతాం.


Updated Date - 2022-10-04T05:13:26+05:30 IST