ఒక్క శాఖలోనే ఐదేళ్లలో Kuwait ఎంతమంది ప్రవాస ఉద్యోగులను తొలిగించిందంటే..

ABN , First Publish Date - 2021-08-31T16:48:47+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్.. కువైటైజేషన్ వైపు చకచక అడుగులేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రవాస కార్మికుల విషయమై పలు కీలక చట్టాలను తీసుకొచ్చింది.

ఒక్క శాఖలోనే ఐదేళ్లలో Kuwait ఎంతమంది ప్రవాస ఉద్యోగులను తొలిగించిందంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్.. కువైటైజేషన్ వైపు చకచక అడుగులేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రవాస కార్మికుల విషయమై పలు కీలక చట్టాలను తీసుకొచ్చింది. ఇక పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్(పీఏహెచ్‌డబ్ల్యూ) కూడా కువైటైజేషన్‌లో భాగంగా గడిచిన ఐదేళ్లలో సుమారు 423 మంది విదేశీ ఉద్యోగులను తొలిగించినట్లు తాజాగా వెల్లడించింది. సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు 423 ప్రవాస ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు పీఏహెచ్‌డబ్ల్యూ పేర్కొంది. ప్రస్తుతం పీఏహెచ్‌డబ్ల్యూ‌లోని వివిధ విభాగాల్లో 1,435 మంది కువైటీ ఉద్యోగులు ఉంటే, 176 మంది విదేశీ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఖాళీ అయిన 423 జాబ్స్‌ను త్వరలోనే దేశీయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక నుంచి వీలైనంత వరకు పీఏహెచ్‌డబ్ల్యూ‌లో దేశ పౌరులనే నియమించుకోవాలనే నిర్ణయించింది. కనుక మిగిలిన 176 ప్రవాసీయ ఉద్యోగులకు కూడా ఉద్వాసన తప్పకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


ఇక కువైటైజేషన్‌లో భాగంగా దేశంలోని 60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికుల విషయంలో కువైత్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీరి వీసా రెన్యువల్ ఫీజును భారీగా పెంచేసింది. యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవాలంటే 2వేల కువైటీ దినార్లు(సుమారు రూ.4.87లక్షలు) చెల్లించాలని మొదట కువైత్ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా మంత్రిమండలి మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రెన్యువల్ ఫీజును 2వేల దినార్ల నుంచి వెయ్యి దినార్లకు(సుమారు రూ.2.43లక్షలు) తగ్గించాలని మంత్రిమండలి ప్రతిపాదించే యోచనలో ఉంది. ఈ వెయ్యి దినార్లలో స్టేట్ ఫీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కవర్ అవుతాయని సమాచారం. ఇందులో ఇన్సూరెన్స్ పాలసీ 500 దినార్లుగా(రూ. 1.21లక్షలు) మంత్రిమండలి పేర్కొంది. త్వరలోనే ఈ ప్రతిపాదనపై కువైత్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.  

Updated Date - 2021-08-31T16:48:47+05:30 IST