Kuwait: 49 మంది ప్రవాస ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్వాసన.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-06-13T16:41:29+05:30 IST

కువైత్ సమాచార మంత్రిత్వశాఖ తాజాగా 49 మంది ప్రవాస ఉద్యోగులను తొలగించింది.

Kuwait: 49 మంది ప్రవాస ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్వాసన.. కారణమేంటంటే..

కువైత్ సిటీ: కువైత్ సమాచార మంత్రిత్వశాఖ తాజాగా 49 మంది ప్రవాస ఉద్యోగులను తొలగించింది. అయితే, ఇది కువైటైజేషన్ పాలసీలో భాగంగా ప్రతి ఏడాది కొంతమంది ప్రవాస ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కువైటీలకు అవకాశం ఇవ్వాలనే నిబంధన ప్రకారం చేసిందిగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో ప్రవాసుల ప్రాబల్యం పెరిగి.. స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదనే కారణంతో 2017లో కువైత్ ప్రభుత్వం కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని సంస్థలు అధిక సంఖ్యలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక ఉద్దేశంతో సివిల్ సర్వీస్ కమిషన్(CEC) కువైటైజేషన్ పాలసీని తీసుకువచ్చింది. దీని అమలుకు ఐదేళ్ల గడువు విధించింది.


ఈ ఐదేళ్లలో ఏడాదికి కొంత శాతం చొప్పున సంస్థలు ప్రవాసుల స్థానంలో స్థానికులను రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే తాజాగా సమాచార మంత్రిత్వశాఖ 49 మంది నాన్-కువైటీ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరి స్థానంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించింది. ఇక తాజాగా తొలగించిన 49 మందిలో 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఏడుగురు ఉన్నట్లు మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తొలగింపులతో మంత్రిత్వశాఖలో ప్రస్తుతం పని చేస్తున్న ప్రవాస ఉద్యోగుల సంఖ్య 100 కంటే తగ్గిందని సమాచారం. 49 మంది ప్రవాస ఉద్యోగుల తొలగింపును సీఈసీ, ఆర్థిక మంత్రిత్వశాఖ ధృవీకరించాయని అక్కడి మీడియా తెలియజేసింది.    


Updated Date - 2022-06-13T16:41:29+05:30 IST