Kuwait మాస్టర్ ప్లాన్.. ప్రవాస పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా కొత్త రెసిడెన్సీ పాలసీ

ABN , First Publish Date - 2021-11-24T13:31:05+05:30 IST

ఒకవైపు కువైటైజేషన్ అంటూ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ మరోవైపు ప్రవాస పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా కొత్త రెసిడెన్సీ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Kuwait మాస్టర్ ప్లాన్.. ప్రవాస పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా కొత్త రెసిడెన్సీ పాలసీ

కువైత్ సిటీ: ఒకవైపు కువైటైజేషన్ అంటూ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ మరోవైపు ప్రవాస పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా కొత్త రెసిడెన్సీ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 5 నుంచి 15 ఏళ్ల భారీ కాలపరిమితితో విదేశీయులకు రెసిడెన్సీని ప్రవేశపెట్టాలని కువైట్ ప్లాన్ చేస్తుందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ప్రవాస పెట్టుబడిదారులు, కంపెనీలు మరియు వాణిజ్య ప్రాజెక్టుల యజమానులు, సెలెక్టెడ్ వ్యాపార యూనిట్ల సీఈఓలకు ఈ అధిక కాలపరిమితో కూడిన రెసిడెన్సీని అమలు చేయాలనే యోచనలో కువైత్ ఉందట. ఇదిలాఉంటే.. దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ప్రవాసుల విషయంలోనూ కువైత్ సర్కార్ సానూకుల ధోరణితో ముందుకెళ్తోంది. అలాంటి వలసదారులకు ఎలాంటి స్పాన్సర్‌షిప్ అవసరం లేకుండా వర్క్ పర్మిట్లు, రెసిడెన్సీ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నట్లు ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 


ఇలా ఈ రెండు పద్దతుల ద్వారా ప్రవాసులకు కువైత్‌పై మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంతో పాటు భారీ మొత్తంలో పెట్టుబడులను రాబట్టాలనేది అక్కడి సర్కార్ మాస్టర్ ప్లాన్. ఇక ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెట్టినవారు, చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వలసదారులకు ఆర్టికల్ 18 ప్రకారం కొంత కాలపరిమితితో నివాస అనుమతులు ఇస్తోంది కువైత్. దీన్నే ఇప్పుడు 5 నుంచి 15 ఏళ్లకు పెంచాలనే యోచనలో ఉంది. ఇలా చేయడం ద్వారా మరింత మంది విదేశీ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలను ఆకర్షించాలనేది కువైత్ ప్రణాళిక.  ప్రస్తుతం ఈ ప్లాన్ అంతర్గత మంత్రిత్వశాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్‌ల వద్ద చర్చల దశలో ఉంది. అంతేగాక అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని మీడియా సమాచారం.  

Updated Date - 2021-11-24T13:31:05+05:30 IST