42వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణకు.. కువైత్ ఎంత ఖర్చు చేసిందంటే..?

ABN , First Publish Date - 2022-04-15T14:14:36+05:30 IST

కువైటైజేషన్ పాలసీ, ఇతర కారణాలతో గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

42వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణకు.. కువైత్ ఎంత ఖర్చు చేసిందంటే..?

కువైత్ సిటీ: కువైటైజేషన్ పాలసీ, ఇతర కారణాలతో గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారిపైనైతే ఉక్కుపాదం మోపుతోంది. తరచూ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో పట్టుబడిన వారిని దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా 2019 జనవరి 1 నుంచి 2021 జూలై 11 వరకు ఏకంగా 42,529 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. దీనికోసం అక్షరాల 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.52.43కోట్లు. అయితే, ఈ వ్యయాన్ని బహిష్కరణకు గురైన ప్రవాసుల స్పాన్సర్ల నుంచి వసూలు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మొత్తాన్ని స్పాన్సర్లు చెల్లించే వరకు వారిని వదలబోయేది లేదని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.      

Updated Date - 2022-04-15T14:14:36+05:30 IST