ఆ దేశ పౌరులకు అన్ని వీసాలు నిలిపివేసిన Kuwait.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-11-11T19:03:49+05:30 IST

లెబనాన్ పౌరులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ కువైత్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ దేశ పౌరులకు అన్ని వీసాలు నిలిపివేసిన Kuwait.. కారణమేంటంటే..

కువైత్ సిటీ: లెబనాన్ పౌరులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ కువైత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ బుధవారం కీలక ప్రకటన చేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతోందని పేర్కొంది. కాగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలు, లెబనాన్ మధ్య కొనసాగుతున్న దౌత్యపర విబేధాల నేపథ్యంలో కువైత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసాలు కలిగిన లెబనాన్ పౌరులకు ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదని సంబంధిత అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ వీసాదారులు ఎప్పుడైనా కువైత్ రావొచ్చని స్పష్టం చేశారు. కొత్తగా వీసాలు పొందినవారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ లేదా గవర్నమెంటల్ వీసాదారులందరికీ ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు.


ఇదిలాఉంటే.. తాజాగా ఇతర దేశాలకు చెందిన వారికి సైతం అన్ని వీసాల జారీని నిలిపివేసింది కువైత్. ఫ్యామిలీ వీసాల జారీ విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా వీసాల జారీని ఆపేసింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగానే 16 ఏళ్లలోపు వయసు ఉన్న ఉద్యోగుల పిల్లలకు వీసాలు ఇస్తామని చెప్పిన కువైత్.. అది కేవలం టీచింగ్, హెల్త్‌కేర్ సెక్టార్లకు చెందిన వారికే మాత్రమేనని షరతు పెట్టింది. ఇప్పుడు ఇదే సమస్యకు కారణమైందని సమాచారం. దాంతో ఇతరులకు కూడా ఏ రకమైన వీసాలు మంజూరు చేయడం లేదు. ఇకపోతే ఫ్యామిలీ వీసా కోసం శాలరీ కండీషన్ కూడా పెట్టింది.


వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అంతేగాక వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(క్యూఆర్ కోడ్‌తో ఉన్నది) సమర్పించడం తప్పనిసరి. ఇక కువైత్ ఇటీవల ఎంట్రీ వీసాలతో సహా అన్ని రకాల వీసాల జారీని ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రవాసులకు వీసాల మంజూరును ప్రారంభించి నట్లు గత శనివారం ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. కమర్షియల్, వర్క్, ఫ్యామిలీ వీసాల కోసం వలసదారులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. 

Updated Date - 2021-11-11T19:03:49+05:30 IST