Kuwait: ప్రవాసులకు కువైత్ మరో షాక్.. హై శాలరీలు ఉండే ఆ పోస్టులను ఇకపై..

ABN , First Publish Date - 2022-09-16T17:23:42+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల ప్రవాసులకు తరచూ వరుస షాక్‌లు ఇస్తోంది.

Kuwait: ప్రవాసులకు కువైత్ మరో షాక్.. హై శాలరీలు ఉండే ఆ పోస్టులను ఇకపై..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల ప్రవాసులకు తరచూ వరుస షాక్‌లు ఇస్తోంది. స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కువైత్ సర్కార్ ధోరణితో వలసదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రెండు రంగాల్లోనూ ప్రవాసుల స్థానాల్లో కువైటీలకు ఉద్యోగాలు (Jobs) కల్పిస్తూ వస్తోంది. ఇప్పటికే అన్ని కీలక శాఖల్లో పనిచేస్తున్న ప్రవాసుల ఉద్వాసన మొదలైంది. ఇదే కోవలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వ సలహాదారులుగా (state advisers) పనిచేస్తున్న ప్రవాసులను తొలగించి వారి స్థానంలో స్థానికులకు అవకాశం కల్పించాలని కువైత్ యోచిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. అధిక జీతాలు చెల్లిస్తున్న ఈ పోస్టులను కువైటీలతో భర్తీ చేయాలనుకుంటుందట. అంతేగాక అసలు ఈ పోస్టులకు ఎందుకంత భారీ శాలరీ చెల్లిస్తున్నారో చెప్పాలంటూ వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను కువైత్ కేబినెట్ (Kuwait Cabinet) ప్రశ్నించిందని సమాచారం. 


ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న స్టేట్ అడ్వైజర్లకు ఇంత భారీ జీతాలు చెల్లించడమేంటని మంత్రిమండలి మండిపడిందని అక్కడి మీడియా పేర్కొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ సలహాదారు (state advisers) పోస్టులను స్థానికులకే ఇవ్వాలనే నిర్ణయానికి కువైత్ సర్కార్ వచ్చిందనేది స్పష్టమవుతుందంటూ అక్కడి మీడియా ఏజెన్సీలు తెలిపాయి. రాబోయే కేబినెట్ మీటింగ్‌లో ఈ విషయమై సివిల్ సర్వీస్ కమిషన్ సభ్యులు తమ అభిప్రాయలు తెలియజేయనున్నారు. అనంతరం దీనిపై మంత్రిమండలి (Cabinet) ఒక నిర్ణయానికి వస్తుంది. ఇక కువైత్‌లో భారీ సంఖ్యలో ప్రవాసులు ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దేశ జనాభా మొత్తం 4.6 మిలియన్లు ఉంటే.. అందులో వలసదారులే 3.4 మిలియన్లు ఉన్నారు. 

Updated Date - 2022-09-16T17:23:42+05:30 IST