కువైత్‌లో Driving licence అంత ఈజీ కాదు.. ప్రపంచంలోనే అత్యంత కఠిన దేశాల్లో Kuwait స్థానం ఇది

ABN , First Publish Date - 2021-09-29T16:14:33+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదని తాజాగా వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది.

కువైత్‌లో Driving licence అంత ఈజీ కాదు.. ప్రపంచంలోనే అత్యంత కఠిన దేశాల్లో Kuwait స్థానం ఇది

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదని తాజాగా వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచంలోనే కువైత్ ఆరో స్థానంలో నిలిచింది. కువైత్‌ స్కోర్ 4.05/10గా నమోదైంది. ఇక కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయసు 18 ఏళ్లు. అలాగే ఇతర కొన్ని విషయాలు కూడా ఆ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. వాటిలో ముఖ్యమైంది డ్రైవింగ్ టెస్టు రుసుము. కువైత్‌లో డ్రైవింగ్ టెస్టు ఫీజు వచ్చేసి సుమారు రూ. 5,200 వరకు ఉంటుంది. దీనికితోడు ప్రాక్టికల్ డ్రైవింగ్ ఎగ్జామ్, వైద్య పరీక్షలు అదనం. అందుకే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీగా దొరకదని తెలుస్తోంది. 


కాగా, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కఠిన నిబంధనలు ఉన్న ఆ దేశంలో వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రతియేటా పెరుగుతున్నాయి. తాజాగా వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం 2018లో 2,203,723 వాహనాలు రిజిస్టర్ అయితే, 2019లో ఈ సంఖ్య 2,368,680గా ఉంది. ఇదిలాఉంటే.. కువైత్ కంటే మరో గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా కఠినతరం అని సమాచారం. ఈ విషయంలో బహ్రెయిన్ 3.62/10 స్కోర్‌తో ప్రపంచంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. క్రొయేషియా(1.96), బ్రేజిల్(3.21), హంగేరీ(3.59) బహ్రెయిన్ కంటే ముందు ఉన్నాయి. ఇక ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ దొరికే దేశాల్లో మెక్సికో(9.48/10), ఖతార్(7.39), లాట్వియా(7.03), అమెరికా(6.95), కెనడా(6.93) ఉన్నాయి. 

Updated Date - 2021-09-29T16:14:33+05:30 IST