మాజీ భర్తపై వేధింపులు.. రూ.20వేల విలువైన చొక్కా చింపేసిన Kuwaiti model.. కోర్టు విధించిన శిక్ష ఇది!

ABN , First Publish Date - 2021-10-30T15:49:26+05:30 IST

మాజీ భర్తపై వేధింపులకు పాల్పడిన 24 ఏళ్ల కువైత్ మోడల్‌కు లండన్ కోర్టు ఏకంగా రూ.6.71 లక్షల జరిమానా విధించింది.

మాజీ భర్తపై వేధింపులు.. రూ.20వేల విలువైన చొక్కా చింపేసిన Kuwaiti model.. కోర్టు విధించిన శిక్ష ఇది!

కువైత్ సిటీ: మాజీ భర్తపై వేధింపులకు పాల్పడిన 24 ఏళ్ల కువైత్ మోడల్‌కు లండన్ కోర్టు ఏకంగా రూ.6.71 లక్షల జరిమానా విధించింది. భర్తపై చేయి చేసుకోవడంతో పాటు అతని రూ.20వేల విలువైన చొక్కాను కత్తిరించినందుకుగాను బ్రిటిష్ న్యాయస్థానం ఆమెకు ఈ భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జూన్ 24న మాజీ భర్త మహమ్మద్ యూసఫ్ మిగారియాఫ్‌తో జరిగిన ఘర్షణలో రావన్ బిన్ హుస్సేన్ అనే కువైటీ మోడల్ రెచ్చిపోయింది. భర్తపై దాడి చేయడంతో పాటు అతను వేసుకున్న రూ.20వేలు విలువ చేసే పోలో కంపెనీ చొక్కాను చింపేసింది. దీంతో మిగారియాఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు బిన్ హుస్సేన్‌ను లండన్‌లోని హైడ్ పార్క్ గేట్‌లో ఉన్న ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మిగారియాఫ్‌ ముఖంపై గాయాలతో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. 


ఇక పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమె మాజీ భర్తపై వేధింపులు ఆపలేదు. జూలై 13న మళ్లీ మిగారియాఫ్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపించింది. "మీరు అసహ్యంగా, దయనీయంగా ఉన్నారు. పచ్చి అబద్ధాలకోరు." అని ఆ సందేశంలో పేర్కొంది. ఇది ఇంతటితో ఆగదని భావించిన మిగారియాఫ్‌ ఆమెపై బ్రిటిష్ కోర్టులో వేధింపుల కేసు వేశాడు. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. దీంతో మాజీ భర్తపై వేధింపులకు పాల్పడిన రావన్ బిన్ హుస్సేన్‌కు న్యాయస్థానం రూ.6.71లక్షల జరిమానా విధించింది. అలాగే మరో రూ.51వేలు ప్రాసిక్యూషన్ ఫీజు చెల్లించాలని ఆదేశించింది.  


Updated Date - 2021-10-30T15:49:26+05:30 IST